Samantha: ఏపీలో న్యూ కల్చర్.. సమంతకు గుడి కడుతున్న అభిమాని..
హీరోయిన్లకు గుడులు కట్టే సంస్కృతి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో లేదనే చెప్పాలి. అది తమిళనాడుకే సొంతం. గతంలో కుష్బూ, నమితలకు ఫ్యాన్స్ గుడులు కట్టారు. తాజాగా ఈ సంస్కృతి ఏపీకి సైతం పాకింది.
ఓ వీరాభిమాని సమంత(Samantha)కు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని బాపట్ల జిల్లా, చుండూరు మండలం, అలపాడుకు చెందిన సందీప్ తెనాలి సామ్‌కు వీరాభిమాని. తన అభిమానానికి గుర్తుగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా తన ఇంటి ప్రాంగణంలో కొంత స్థలాన్ని కేటాయించి గుడి నిర్మాణం చేపట్టాడు. ఇప్పటికే ఒక ప్రముఖ శిల్పి చేత సమంత(Samantha) ప్రతిమను కూడా చేయించాడు. త్వరలోనే విగ్రహ ప్రతిష్ట కూడా చేయనున్నాడు.
ఈ విషయంపై సందీప్ మీడియాతో మాట్లాడుతూ.. తానెప్పుడూ నేరుగా సమంతను కలవలేదని.. కానీ తనకు సమంత అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆమెకు తాను విరాభిమానినని వెల్లడించాడు.
హీరోయిన్‌గానే కాకుండా.. ఆమె చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు సైతం తాను ఫిదా అయినట్టు వివరించాడు. ఎంతో మంది చిన్నారులకు ఆమె తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు చేయించిందని.. ఇంకా ఎందరో వృద్ధులకు ఆశ్రయం కల్పించడం వంటివి చేస్తోందని.. ఇంతకంటే సమంతను అభిమానించేందుకు ఏం కావాలని ప్రశ్నిస్తున్నాడు. అందుకే సామ్(Samantha) కోసం గుడి కట్టిస్తున్నాడట.
ప్రస్తుతం సందీప్.. సమంతకు గుడి కట్టిస్తున్న విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.