హత్య కేసులో ప్రముఖ నటుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

హత్య కేసులో ప్రముఖ నటుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

ఒక హత్యకేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీపను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మైసూరులో ఆయనతో పాటు మరో పదిమందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. రేణుకా స్వామి అనే వ్యక్తం ఈ నెల 8న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో దర్శన్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు సైతం దర్శన్ పేరే ఎక్కువగా వినిపించింది.

ఈ కేసులో నిందితుడితో దర్శన్ తూగుదీప నిత్యం టచ్‌లో ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆయనను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఓ షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే.. నటి పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపించాడట. మరి ఈ కారణంగానే దర్శన్.. రేణుకాస్వామిని హత్య చేయించాడా? లేదంటే మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. అసలు పవిత్ర గౌడ ఎవరంటారా?

కన్నడ నటి పవిత్ర గౌడతో దర్శన్‌కు సంబంధం ఉందని గతంలో పుకార్లు తెగ హల్‌చల్ చేశాయి. స్వయంగా పవిత్ర గౌడ సైతం తనకు దర్శన్‌తో సంబంధం ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద పోస్ట్ కూడా పెట్టింది. దీనిపై దర్శన్ భార్య విజయలక్ష్మి స్పందించారు. పవిత్ర గౌడపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొద్ది నెలల క్రితం ఈ వివాదం గట్టిగానే నడిచింది. ఆ తరువాత నటి పవిత్ర గౌడపై రేణుకా స్వామి కూడా సోషల్ మీడియాలో కొన్ని కించపరిచే పోస్ట్‌లు పెట్టడమే కాకుండా.. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే హత్య జరిగినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.