Yatra 2: యాత్ర 2… ఇన్‌స్పైరింగ్ స్టోరీ!
యాత్ర మూవీకి సీక్వెల్‌గా యాత్ర 2 సినిమా రూపొందింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర మూవీ రూపొందింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి జీవించారు.
వైఎస్‌ఆర్‌లోని ఠీవి, దర్పాన్ని యథాతథంగా ఆకళింపు చేసుకున్నట్టుగా మమ్ముట్టి పెర్ఫార్మెన్స్ ఉండింది. ఇక నేడు యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది? యాత్ర మాదిరిగా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనేది చూద్దాం.
దర్శకుడు మహి.వి. రాఘవ్ అయితే యాత్ర 2 సినిమాకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. యాత్ర 2 మూవీ వైఎస్‌ఆర్ మరణానంతరం ఆయన తనయుడు జగన్ ఎన్ని ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు? ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న కష్టనష్టాలతో ఈ సినిమాను రూపొందించారు.
యాత్రకు కొనసాగింపుగా వచ్చిన యాత్ర 2 సైతం ప్రతి ఒక్కరి గుండెలకు హత్తుకునేలా రూపొందించారనడంలో సందేహం లేదు. ఇలాంటి బయోపిక్స్ సహజంగా రామ్ గోపాల్ వర్మ తీస్తుంటారు. ఆయన ఎక్కువగా విపక్ష నేతలను విలన్స్‌గా చూపిస్తుంటారు. కానీ యాత్ర 2లో అలాంటిదేమీ లేదు.
వైసీపీ అధినేత జగన్.. పార్టీ స్థాపించడం.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేయడం.. ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లడం వంటి సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా సాగాయి. ఇక వైఎస్ జగన్ పాత్రలో నటించిన జీవా ఆ పాత్రకు సరిగ్గా సెట్ అయ్యారు. పక్కాగా జగన్ హావభావాలను అనుకరించారు.
తొలుత ఈ సినిమాలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబులను తప్పుగా చూపించారంటూ ప్రచారం అయితే జరిగింది. కానీ అలాంటిదేమీ లేదు. ముఖ్యంగా సినిమాలో జగన్‌కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జగన్ ఎంతలా శ్రమించారనేది కథ సారాంశం. యూత్‌కి ఇదొక ఇన్‌స్పైరింగ్ కథ అవుతుందనడంలో సందేహం లేదు.
ఈ రాజకీయాల్లో కానీ, జీవితంలో కానీ నెగ్గాలంటే ఓపిక, సహనం నేర్చుకో జగన్ అని వైఎస్సార్ చెప్తారు. తన తండ్రి సమాధి ముందు కూర్చున్నప్పుడు ఆ మాట తన మనసులోకి వచ్చినట్లు జగన్ భావిస్తారు. ఆ తర్వాత జగన్ ఓపికగా కష్టపడి, జనంలో తిరిగి, జనంతో మమేకమై విజేతగా గెలుస్తారు. ఈ సినిమాలో ఉన్న మంచి సందేశం అదే. జీవితంలో నెగ్గాలంటే ఓపిక ఉండాలి. కష్టపడాలి. సహనం అలవరచుకోవాలి. “యాత్ర 2” సినిమా, జగన్ రాజకీయ జీవితం యువతకి నేర్పేది ఇదే.
మహి రాఘవ తన రచనతో, తన దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమాని కేవలం రాజకీయ చిత్రంగానే కాకుండా ఒక ఇన్ స్పైరింగ్ స్టోరీగా మలిచారు. జగన్ ని అభిమానించే వాళ్ళు అయినా, వ్యతిరేకించే వాళ్ళు అయినా, సామాన్యులు అయినా, రాజకీయ పరిశీలకులు అయినా దీన్ని తప్పక చూడాలి ఒకసారి.