అందరి చూపు కేసీఆర్‌పైనే.. మునుపటి వేడితో మాట్లాడతారా?
పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను ఏలిన కె. చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష నేతగా ఇప్పటి వరకూ తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టింది లేదు. నేడు ఆయన ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభ సమావేశాలకు హాజరవుతుండటం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ వైపు చూడలేదు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి గానూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతోంది.
ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండు రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. నేడు తెలంగాణలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ హాజరు కానున్నారు.
తొలిరోజు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడతారా? మునుపటి వేడితో మాట్లాడతారా? ఏదో మమ అనిపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్ 8న కేసీఆర్ జారిపడి గాయపడ్డారు. ఆయనకు తుంటి ఎముక విరగడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అప్పటి నుంచి కేసీఆర్ తమ నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కాస్త నడుస్తున్నా కూడా ఆయన అసెంబ్లీకి మాత్రం హాజరు కాలేదు. ప్రస్తుతమైతే అందరి చూపు కేసీఆర్‌పైనే ఉంది.