ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరో దారీ లేదు
ఏపీలో అధికార పార్టీలో ఉండి నిన్న మొన్నటి వరకూ పదవులు అలంకరించిన వారు నేడు రాజీనామా చేసి పార్టీతో పాటు అధినేత జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో పాటు తనను పక్కనబెట్టి గంజి చిరంజీవిని పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిని చేయడాన్ని సహించలేకపోయారు. దీంతో ఆళ్ల పార్టీకి రాజీనామా చేశారు.
అయితే పార్టీ ఆయన రాజీనామాను ఆమోదించిందా? లేదా? అనే విషయాలను పక్కనబెడితే నిన్నటి వరకూ తనను ఆదరించిన పార్టీపైనే దుమ్మెత్తి పోయడానికి ఆయన సిద్ధమవడం గమనార్హం. ఇప్పటికే ఆయన తన అనుచరులతో భేటీ అవుతూ.. తన రాజీనామా కారణాలను జనాల్లోకి తీసుకెళ్లాలని సూచిస్తున్నారట. తన నియోజకవర్గంలో గడిచిన మూడు నెలల్లో ఒక్క పని కూడా చేయలేకపోతున్నానని ఆవేదన చెందుతున్నాననే విషయాన్ని వెల్లడిస్తున్నారట. అంటే పరోక్షంగా ఆయన పార్టీని ఇరుకునబెట్టేందుకు యత్నిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఆయనకైతే టీడీపీ, జనసేనల్లోకి అయితే ఎంట్రీ ఉండదు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆయనకు రాజకీయ సన్యాసం తప్ప మరో దారి లేదని అంటున్నారు. కనీసం తనను కలవడానికి వెళ్లిన మంగళగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజి చిరంజీవిని సైతం కలవలేదట. దీంతో ఆయన వెనుదిరిగారట. మొత్తానికి ఆర్కే పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనని అంటున్నారు. ప్రజలు సైతం ఆర్కే తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.