ఇండియా టుడే సర్వే.. ఏ పార్టీ గెలుస్తుందంటే…
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇక్కడ వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమవగా.. టీడీపీ, జనసేనలు మాత్రం పొత్తుతో ముందుకు వెళుతున్నాయి. వీటితో బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ సైతం వైఎస్ షర్మిలకు పగ్గాలు అప్పగించి ఉనికిని చాటుకోవాలని భావిస్తోంది. ఈసారి ఏపీలో వామపక్షాలు సైతం యాక్టివ్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లాలని భావిస్తున్నాయి.
ఇక ఏపీలో సర్వేలు రాజ్యమేలుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఎన్నో సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. వీటిలో నేషనల్ మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. తాజాగా జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ఛానల్.. సి ఓటర్ సంస్థతో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట సర్వే నిర్వహించింది. వైసీపీ, టీడీపీ- జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను విభజించి సర్వే చేసింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలకు భిన్నంగా ఇండియా టుడే సర్వే ఉండటం.
లోక్‌సభ స్థానాలను ప్రాతిపదికగా తీసుకుని ఇండియా టుడే సంస్థ సర్వే నిర్వహించింది. 25 పార్లమెంటు స్థానాల్లో అత్యధిక స్థానాలను టీడీపీ – జనసేన కూటమి దక్కించుకుంటుందని సర్వే తేల్చింది. ఈ కూటమి 17 పార్లమెంటు స్థానాలను సొంతం చేసుకుంటుందట. ఇక మిగిలిన 8 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందట. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే.. టీడీపీ-జనసేన కూటమి 119 స్థానాలను.. వైసీపీ 56 స్థానాలను కైవసం చేసుకుంటుందట. ఇక ఒంటరిగా పోటీ చేస్త మాత్రం కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీజేపీ తక్కువ శాతం ఓట్లను దక్కించుకుంటుందట. టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, వైసీపీకి 41 శాతం, కాంగ్రెస్‌కు 2.7 శాతం, బీజేపీ 2.1 శాతం ఓట్లను కైవసం చేసుకుంటుందని ఇండియా టుడే వెల్లడించింది.