కాంగ్రెస్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్న టీడీపీ, జనసేన

కాంగ్రెస్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్న టీడీపీ, జనసేన

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయ రహస్యం ఆరు గ్యారెంటీలేనని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ సైతం ఇదే ప్రచారం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా అదేనో ఏమో కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆరు గ్యారెంటీలపైనే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగానే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చారు. ఇక ఏపీలో టీడీపీ, జనసేనలు సైతం ఈ పథకాలను కాపీ కొట్టారు. చంద్రబాబు తాజాగా ఇదే హామీని ప్రకటించారు.

ఏపీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని నిన్న యువగళం సభ సాక్షిగా హామీ ఇచ్చేశారు. ఇది విన్న మహిళలూ హ్యాపీ. అయితే ఈ హామీని నిలుబెట్టుకోవడం ఈజీయే కానీ దానిని అమల్లోనే కొంత తంటా ఉంది. జనం తిట్టుకోకుండా దానిని అమలు చేయగలగాలి. మరి ఆ సత్తా చంద్రబాబుకు ఉందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉచిత ప్రయాణం అనగానే పని ఉన్నా లేకున్నా మహిళలు బస్సుల్లో ఎటో ఒకవైపు వెళుతున్నారు. ఇది సర్వసాధారణం. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టలేం.

Advertisement

తెలంగాణలో అంతకు ముందు క్యాబ్, ఆటో వాడేవాళ్లు కాస్త బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బీభత్సంగా పెరిగిపోయింది. కొన్ని చోట్ల అయితే బస్సుల్లో మహిళలు కొట్టుకుంటున్న ఘటనలూ లేకపోలేదు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆర్టీసీ బస్సులను పెంచడమొక్కటే దారి. మరి చంద్రబాబు ఇది చేయగలరా? అసలే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీలో బస్సుల సంఖ్యను పెంచడం సాధ్యమేనా? అది తలకు మించిన భారం కాదా? చంద్రబాబు ఈ విషయాలన్నింటిలో జాగ్రత్త తీసుకోగలరా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి టీడీపీ, జనసేనలు అయితే కాంగ్రెస్‌ను చూసి వాత పెట్టుకుంటాయనేది మాత్రం అక్షరసత్యం.