అప్పుల ఊబిలో తెలంగాణ.. రూ.6,71,757 కోట్లకు పెరిగిందట
తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు శాసనసభా సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. రోజువారీ ఖర్చులకు సైతం అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఆర్థిక అరాచకత్వాన్ని తెలియజెప్పాలనే బాధ్యతతోనే శ్వేతపత్రం విడుదల చేశామని భట్టి తెలిపారు.
తెలంగాణ బడ్జెట్‌కు.. వాస్తవ వ్యయానికి పొంతనే లేదని భట్టి పేర్కొన్నారు. రెండింటి మధ్య 20 శాతం అంతరం ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ విషయానికి వస్తే.. అంచనాలకు.. వాస్తవ వ్యయాలకు సంబంధమే లేదన్నారు. తెలంగాణ వచ్చిన ఏడాది.. అంటే 2014- 15 ఆర్థిక సంవత్సరంలో అప్పు 72,658 కోట్లు అయితే.. ఇప్పుడది రూ.6,71,757 లక్షల కోట్లకు అప్పు పెరిగిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులు బాటు తగ్గడానికి కారణం.. రెవెన్యూ రాబడిలో 35% ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు వెళ్లడమేనన్నారు. విద్య, వైద్య రంగాలకు సరిపడా నిధులు కేటాయించలేకపోయిందని భట్టి వెల్లడించారు. చివరకు రోజువారి ఖర్చులకు సైతం ఆర్‌బీఐపై ఆధారపడాల్సిన దుస్థితి వచ్చిందని వివరించారు. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం అప్పు పెరిగిందట. బడ్జెటేతర రుణాలు పేరుకుపోవడంతో తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు.