టీడీపీకి పవన్ బై చెబుతారా? పొత్తును చిత్తు చేస్తారా?

టీడీపీకి పవన్ బై చెబుతారా? పొత్తును చిత్తు చేస్తారా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మం పాటించలేదు కాబట్టి తాను పాటించడం లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాలను ప్రకటించేశారు. ఈ విషయం ఒకింత షాక్‌కు గురి చేస్తోంది. చంద్రబాబు.. మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించి చాలా రోజులవుతుంది. అప్పుడు స్పందించిన పవన్ సడెన్‌గా ఇప్పుడిలా రెండు స్థానాలను ప్రకటించడం విస్మయానికి గురి చేస్తోంది. పొత్తులో ఏమైనా తేడా వచ్చిందా? లేదంటే పవన్ కల్యాణ్ వెనుక ఎవరైనా ఉండి ఇలా ఆయనను నడిపిస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. గణతంత్ర దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ హాట్ టాపిక్‌గా మారారు.

టీడీపీకి ఝలక్ ఇచ్చిన పవన్..

అసలు పవన్ ప్రకటన వెనుక ఆంతర్యం ఏమటనేది సర్వత్రా జరుగుతున్న చర్చ. చాలా రోజుల పాటు మాట్లాడకుండా ఊరుకుని ఇవాళ రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పైగా చంద్రబాబే సీఎం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకటించి ఎన్ని రోజులవుతోంది? ఇప్పుడు లోకేష్ ప్రకటనపై స్పందించడం కూడా అనుమానాలకు తావిస్తోంది. తాను ఇంతకాలం సహనంతో ఉన్నానని.. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్టే తనకు కూడా ఒత్తిడి ఉంటుందంటూ టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఏదైతేనేమి బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తామని చెబుతున్న పవన్ ఒక్క సారిగా రిపబ్లిక్ డే రోజున బాంబు పేల్చారు. టీడీపీ వైఖరి అయితే జనసేన కేడర్‌కు నచ్చడం లేదనడంలో సందేహం లేదు. పైగా జనసేన కారణంగా టీడీపీకి కలిసొస్తుంది తప్ప.. ఆ పార్టీ కారణంగా తమకు ఒరిగేదేమీ లేదని జనసేన కేడర్ చెబుతూ వస్తోంది.

టీడీపీకి పవన్ బై చెబుతారా? పొత్తును చిత్తు చేస్తారా?

కాపులు సైతం పార్టీకి దూరం..

కేడర్ మాటలను పవన్ పట్టించుకోలేదు. అంతేకాదు.. ఒకానొక సమయంలో పొత్తు నచ్చని వారు వెళ్లిపోవచ్చని కూడా ఆదేశించారు. ఇది జనసేన కేడర్‌లో ఆగ్రహావేశాలు తెప్పించింది. టీడీపీ జెండా మోయడానికో.. బ్యానర్లు కట్టడానికో తాము లేమని తెగేసి చెప్పారు. అలాగే జనసేనకు అండదండగా ఉన్న కాపులు సైతం పార్టీకి దూరమయ్యారు. ఇలాంటి తరుణంలో జనసేన హైప్ క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. సీఎం పదవిపై లోకేష్ చేసిన కామెంట్స్ జనసేన కేడర్‌లో మరింత ఆగ్రహం తెప్పించాయి. ఇప్పటికైనా తమ అధినేతలో చలనమొచ్చిందని సంతోషిస్తున్నారు. బీజేపీతో కలిసి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందని సైతం ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే జనసేనాని.. టీడీపీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతం జనసేనాని తీరుపై టీడీపీ స్పందించే తీరును బట్టి జనసేన నెక్ట్స్ స్టెప్ వేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.