చిరును టార్గెట్ చేసిన వైసీపీ.. ఎందుకీ తలనొప్పులు!

చిరును టార్గెట్ చేసిన వైసీపీ.. ఎందుకీ తలనొప్పులు!

మెగాస్టార్ చిరంజీవి.. ఇకపై రాజకీయాల జోలికి రానంటూ ఎప్పుడో చెప్పేశారు. అలాగే ఉంటే బాగానే ఉండేది. తిరిగి రాజకీయ నాయకులతో భేటీ అయ్యారు. తమ్ముడు తన వాడు కాబట్టి ఏదైనా ఒక ప్రకటన చేసి ఊరుకోవడమో వంటివి చేస్తే బాగానే ఉండేది కానీ బీజేపీ అభ్యర్థులతో భేటీ కావడమే పెను సంచలనానికి దారి తీసింది. వైసీపీ నేతలు ఏకి పారేసే వరకూ వెళ్లింది. నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు చిరు అంతలా టార్గెట్ అవుతున్నారో చూద్దాం. 

అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుఫున సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు చిరు మద్దతు తెలపడమే చర్చనీయాంశంగా మారింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల పొత్తుపై సైతం చిరు హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఏపీ ప్రజానీకం ఒక్కసారిగా నివ్వెరబోయింది. ఎందుకంటే చిరు రాజకీయాలకు గుడ్ బై చెప్పి దశాబ్ద కాలమవుతోంది. అలాంటి చిరు సడెన్‌గా సీఎం రమేష్‌కు మద్దతు ఇవ్వడమేంటి? వైసీపీ నేతలైతే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. చిరు కూడా ప్యాకేజ్‌కి అమ్ముడు పోయారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. లేదంటే సీఎం రమేష్‌కి మద్దతు తెలిపితే ఆయన జనసేనకు ఆర్థికంగా అండగా ఉంటారని ఇలా చేశారని అంటున్నారు.

చిరును టార్గెట్ చేసిన వైసీపీ.. ఎందుకీ తలనొప్పులు!

ప్రజారాజ్యం మొదలుకుని ఇప్పటి వరకూ అన్ని వీడియోస్ తీసి.. మరీ చిరంజీవిని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఏకి పారేస్తున్నారు. కార్యకర్తలే కాదు.. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు నేతలు చిరుపై మండిపడుతున్నారు. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును తప్పుబట్టిన మీరే ఇప్పుడు అదే నోటితో ఎలా మద్దతు ప్రకటిస్తారని ఫైర్ అవుతున్నారు. అసలు రాజకీయాల గురించి మీకెందుకు? ఇవన్నీ మాట్లాడుకుండా సైలెంట్‌గా మీ పని మీరు చూసుకోవచ్చు కదా అని దుయ్యబడుతున్నారు. మొత్తానికి సీఎం రమేష్‌కి మద్దతు పలికి చిరు లేని పోని అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు.