ఎన్నికల్లో కీలకమైనది మేనిఫెస్టో. రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇవాళ (మంగళవారం) టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల అగ్రనేతలు కలిసి ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో మూడు పార్టీలు జతకట్టాయన్నారు.
ఇక కేంద్ర సహకారం మేనిఫెస్టో అమలుకు తప్పక ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోను రేపటి ఆంకాంక్షలను సాకారం చేసేలా రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని పవన్ తెలపిారు. పోలవరం ప్రాజెక్టును గోదారిలో ముంచేయడే కాకుండా ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారన్నారు. ఇక సంక్షేమ పథకాలను 100కి పైగా రద్దు చేశారన్నారు. ప్రజల ఆస్తులను కబ్జా చేశారని.. 12 వేల కోట్లను స్థానిక సంస్థలను మళ్లించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.
ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకూ ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.
యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.
ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్.
పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం.
ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం.
ఇసుక ఉచితం.
రాజధానిగా అమరావతి కొనసాగింపు.
భూ హక్కు చట్టం రద్దు.
సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20వేల సాయం. వారిక వ్యతిరేకంగా తెచ్చిన 217 జీవో రద్దు.