కూటమి మేనిఫెస్టో విడుదల..

కూటమి మేనిఫెస్టో విడుదల..

ఎన్నికల్లో కీలకమైనది మేనిఫెస్టో. రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇవాళ (మంగళవారం) టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల అగ్రనేతలు కలిసి ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో మూడు పార్టీలు జతకట్టాయన్నారు.

ఇక కేంద్ర సహకారం మేనిఫెస్టో అమలుకు తప్పక ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మేనిఫెస్టోను రేపటి ఆంకాంక్షలను సాకారం చేసేలా రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని పవన్ తెలపిారు. పోలవరం ప్రాజెక్టును గోదారిలో ముంచేయడే కాకుండా ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారన్నారు. ఇక సంక్షేమ పథకాలను 100కి పైగా రద్దు చేశారన్నారు. ప్రజల ఆస్తులను కబ్జా చేశారని.. 12 వేల కోట్లను స్థానిక సంస్థలను మళ్లించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

 • మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
 • దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.
 • ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకూ ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.
 • నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.
 • యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
 • ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
 • ‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
 • రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.
 • ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.
 • పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం.
 • ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం.
 • ఇసుక ఉచితం.
 • రాజధానిగా అమరావతి కొనసాగింపు.
 • భూ హక్కు చట్టం రద్దు.
 • సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20వేల సాయం. వారిక వ్యతిరేకంగా తెచ్చిన 217 జీవో రద్దు.
 • బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం.
 • చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.
 • బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.
 • వృద్ధాప్య పింఛను నెలకు రూ.4వేలు, పెంచిన పింఛను ఏప్రిల్‌-2024 నుంచి అమలు. దివ్యాంగులకు రూ.6వేల పింఛను.
 • బీసీలకు 50 ఏళ్లకు నెలకు రూ.4వేల పింఛను.
 • ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ.
 • ఎన్డీయే తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు.
 • చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు.
 • బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు.
 • ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి సరైన పరిష్కార మార్గం సూచిస్తాం.
 • ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేస్తాం.
 • వలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం.
 • కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం.
 • ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు.
 • అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం చేస్తాం.
 • దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.
 • ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం.
 • గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు.
 • వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు.
 • స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌.
 • ఇబ్బందుల్లో ఉన్న చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.
 • మెగా డీఎస్సీపై తొలి సంతకం.
 • ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.
 • పరిశ్రమలకు అనుగుణంగా విధానాలు.
 • అందరికీ అందుబాటులో డిజిటల్‌ లైబ్రరీలు.
 • క్రీడలకు ప్రోత్సాహం.
 • ప్రతి మండలంలో జనరిక్‌ మందుల దుకాణాలు.
 • అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. పండుగ కానుకలు ఇస్తాం.
 • ఈడబ్ల్యూఎస్‌ నుంచి కాపులకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లు.
 • పీఆర్సీ ప్రకటిస్తాం.. ఆలోగా ఇంటెరిమ్‌ రిలీఫ్ ఇస్తాం.
 • ఆడపిల్లల విద్యకోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం
 • రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా.
 • అందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు.
 • విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మిస్తాం.
 • జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.10వేల గౌరవ భృతి.