ఊదరగొట్టి ఉసూరుమనిపించిన టీడీపీ, జనసేన..!

ఊదరగొట్టి ఉసూరుమనిపించిన టీడీపీ, జనసేన..!

ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అని.. అప్పుడెప్పుడో మహానాడు కార్యక్రమంలోనే ఆర్భాటంగా సూపర్ సిక్స్ అంటూ ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలకే కాస్త సానబెట్టి వదిలింది టీడీపీ. అసలు ఎన్నికలు కనుచూపు మేరలో లేవు. షెడ్యూల్ అనేది కూడా ఈ ఏడాది వచ్చే అవకాశమే లేదు. టీడీపీ ఎందుకింత తొందర పడుతోందా? అనుకున్నారా? పోనీలే వస్తే రానివ్వమని సర్ది చెప్పుకున్ానరు. ఇక అప్పుడే దసరా నాటికే పూర్తి మేనిఫెస్టో అని ఊదరగొట్టింది. 

సరే దసరా నాటికి మేనిఫెస్టో వస్తుందని అంతా భావించారు. ఆ తరువాత టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. సరే కాస్త లేటయినా మేనిఫెస్టో రావడం మాత్రం కన్ఫర్మ్ అనుకున్నారంతా. రాజమండ్రిలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోను నవంబర్ 1కి తీసుకొస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. నిజమేనేమో నవంబర్ 1 నాటికి మేనిఫెస్టో పక్కా అని మరోసారి అంతా భావించారు. 

నేడు నవంబర్ 1. అటు జనసేనాని తన అన్న కుమారుడి వివాహమని ఇటలీకి.. ఇటు నారా లోకేష్ తన తండ్రి కేసుల పేరిట హస్తినకు వెళ్లిపోయారు. ఇక మేనిఫెస్టో ఊసే లేదు. అంత ఆర్భాటంగా ప్రకటించడమెందుకు? ఎవరి దారి వారు చూసుకోవడమెందుకని జనం ప్రశ్నిస్తున్నారు. స‌హ‌జంగానే ఉమ్మ‌డి మ్యానిఫెస్టో అనగానే రాజ‌కీయాల‌క‌తీతంగా అంద‌రూ ఎదురు చూశారు. కనీసం తిరిగి ఎప్పుడు ప్రకటిస్తామనేది కూడా లేకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.