ఈ ఎన్నికల్లో YSRTP పోటీ చేయట్లేదు.. షర్మిల సంచలనం!

ఈ ఎన్నికల్లో YSRTP పోటీ చేయట్లేదు.. షర్మిల సంచలనం!

తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. ఇప్పుడు ఆమె ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కేవలం సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని షర్మిల వెల్లడించారు. తాము కూడా పోటీలో నిలిస్తే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలి.. ఆ పార్టీకి లాభం చేకూరుతుందని.. తద్వారా వచ్చే ఎన్నికల్లో తిరిగి కేసీఆరే అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి పోటీ నుంచి తాము తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్టు షర్మిల వెల్లడించారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదని షర్మిల పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తానని పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన వైఎస్సార్‌టీపీ అధినేత్రి ఆ తరువాత నిర్ణయం మార్చుకున్నారు. కాంగ్రెస్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్ నడిచింది. ఆ తరువాత ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని షర్మిల ప్రకటించారు. నేటి నుంచి తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ తరుణంలో పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటించి షర్మిల షాక్ ఇచ్చారు.

Advertisement

 కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. అయితే షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు లాభిస్తుందనేది చూడాలి. కాగా ఆది నుంచి తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పిన షర్మిల నేడు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. పొంగులేటి శ్రీను అన్న తాను చేసిన ప్రతి పోరాటంలోనూ అండగా ఉన్నారన్నారు. అలాగే తన తండ్రి మరణ సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచారన్నారు. ప్రస్తుతం శ్రీను అన్న పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు కాబట్టి తానేం చేయాలో ప్రజలే నిర్ణయించాలని షర్మిల పేర్కొన్నారు.