వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి థ్యేయం: పవన్
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాబోయేది జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పవన్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా పిఠాపురంలో జనసేన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి థ్యేయమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేవీ ఆగిపోవని తెలిపారు. ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని పవన్ తెలిపారు.
వైసీపీ నేతల దోపిడిని అరికడితే చాలు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుబవమే కాకుండా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని రాజకీయ కక్షతో జైలు పాలు చేసినప్పుడు బాధ వేసిందని పవన్ తెలిపారు. ఆ సమయంలో రాజమహేంద్రవరం వెళ్తున్నప్పుడు దారిపొడవునా టీడీపీ కార్యకర్తలు తమ అధినేత కోసం పడిన తపన, ఆవేదన తనను కదిలించిందన్నారు. చంద్రబాబును కలిశాక తన వంతుగా ఏదైనా చేయాలని అనిపించిందని.. అదే పొత్తుకు కారణమని తెలిపారు. ఆ సమయంలోనే బీజేపీతో కూడా కలిసి వస్తుందని చెప్పిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు.
బీజేపీ కోసం తాను ఎంపీ సీట్లు తగ్గించుకున్నానని పవన్ వెల్లడించారు. అంటే తాను పొత్తు కోసం ఎంత తపించానో.. ఆ స్థాయిలోనే మూడు పార్టీల కార్యకర్తలంతా కూటమి గెలుపు కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇబ్బందులెదురైనా అధిగమించాలన్నారు. అలకలు, సంఘర్షణలన్నింటినీ పక్కనబెట్టి వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కోసం పోరాడాలన్నారు. జనసేన సీట్ల పోటీ విషయంలో తాను ఏనాడూ లెక్కలు వేసుకోలేదని.. ఏపీ భవిష్యత్ బాగుండాలి.. అలాగే వైసీపీ కీచక పాలనను తరిమికొట్టాలనే ముందుకెళ్లానని తెలిపారు. అయితే పొత్తుల వల్ల జనసేన నాయకులు కొంత ఇబ్బంది పడ్డారని.. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయలేకపోతుండటంతో ఆవేదనకు గురయ్యారని పవన్ తెలిపారు.