బాబు-రమణ.. ఓ సూర్యదేవర..!

బాబు-రమణ.. ఓ సూర్యదేవర..!

సూర్యదేవర ప్రసన్నకుమార్‌.. ఇప్పుడీ పేరు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో మార్మోగుతోంది..! ఎందుకంటే.. ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవరను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇటీవల సెక్రటరీ జనరల్ పదవికి రామాచార్యులు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని ప్రసన్నకుమార్ నియామకంతో భర్తీ చేశారు. ఈ పోస్టింగ్‌తో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ అయ్యింది. అసలు ఎవరీయన..? ఈయనకే ఎందుకిచ్చారు..? అని కొందరు అంటుంటే.. ఈయన గురించి తెలిసి కూడా పోస్టింగ్ ఎలా ఇచ్చారంటూ తిట్టిపోస్తున్న వాళ్లూ ఉన్నారు. వివాదస్పద వ్యక్తికి కూటమి సర్కార్‌ బొనాంజా ఇచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరీ సూర్యదేవర..?

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్.. సుప్రీం సీజేగా ఎన్‌.వి.రమణ హయాంలో ఓ వెలుగు వెలిగారు.. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా నియామకమై నానా రచ్చ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన చుట్టూ అనేక వివాదాలూ ఉన్నాయి. ప్రసారభారతిలో తెలుగు అనువాదకుడిగా మొదలై.. లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీకి ఓఎస్టీడీగా.. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ వద్ద విధులు నిర్వహించారు. అనంతరం 2015లో ఢిల్లీ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి సెక్రటరీగా నియామితులయ్యారు. ఆ తర్వాత ప్రసన్నకుమార్‌ను తిరిగి మాతృ సంస్థ ఆలిండియా రేడియోకు పంపాలని నాటి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గర్నవర్‌ నజీబ్‌ జంగ్‌ ఆదేశించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలా ఒకటా రెండా వివాదాలే ఊపిరిగా ఇన్నాళ్లు బతికారనే విమర్శలు ఉన్నాయి. ఆఖరికి అటు తిరిగి.. ఇటు తిరిగి ఎన్వీ రమణ దగ్గరికి చేరిన ప్రసన్న మీడియా మేనేజర్‌ బాధ్యతలు స్వీకరించారు. తన కోసం ఇన్నాళ్లు పనిచేసిన ప్రసన్నకు పదవీకాలం చివరి రోజుల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా అబ్జార్వ్‌ చేస్తూ అప్పటి రమణ ఆదేశాలు చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నియామకం నిబంధనలకు పూర్తిగా విరుద్దంగా ఉందని తర్వాత వచ్చిన సీజేఐ యూయూ లలిత్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టుకు చాలా మంది డిప్యుటేషన్ మీద వస్తుంటారని, కానీ వారెవరినీ పర్మనెంట్ ఉద్యోగులుగా నియమించడం శుభపరిణామం కాదని వ్యాఖ్యానించారు.

ఇతను అవసరమా..?

ఇన్ని ఆరోపణలు.. వివాదాలున్న వ్యక్తికి ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదే పదవిలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గతంలో రాజ్యసభలో సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన పీపీకే. రామాచార్యులను నియమించింది. ఈ ప్రభుత్వం వచ్చాక అనుభవజ్ఞుడు, మచ్చలేని రామాచార్యులను రాజీనామా చేయించింది. నిరంతరం వివాదాలున్న సూర్యదేవర ప్రసన్నను ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా ఆయన నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే.. అదే పదవిని పేర్కొంటూ ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం విడ్డూరం. కూటమి సర్కార్‌లో మున్ముందు ఎన్నెన్ని వింతలు.. విచిత్రాలు చూడాల్సి వస్తుందో.. ఏంటో అని జనాలు మాట్లాడుకుంటున్నారు.

Google News