Dil Raju: దిల్ ‌రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా.. పెద్ద ప్లానే ఉందిగా..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతున్నారా..? సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటిన ఆయన రాజకీయాల్లోనూ రాణించాలని భావిస్తున్నారా..? చట్టసభల్లోకి అడుగుపెట్టడమే దిల్‌రాజు చిరకాల కోరికా..? రానున్న ఎన్నికల్లో పోటీచేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అది కూడా అధికార బీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగాలని ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నారా..? అంటే తాజా జరిగిన ఓ సంఘటనను చూసే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ అదేంటి..? నిజంగానే ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇక రాజకీయాలే..!

దిల్ రాజు.. (Dil Raju) ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. నాడు.. నేడూ ఈయనే టాలీవుడ్ నిర్మాతల్లో కింగ్.. ఈ విషయం ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజం. దిల్ రాజు సినిమా ఏదైనా రిలీజ్ అవుతోందంటే ఆయన దరిదాపుల్లోకి రావడానికి ఎంత పెద్దోళ్లయినా సాహసించరు. అలా టాలీవుడ్‌ను ఏలిన ఆయన.. ఇప్పుడు రాజకీయాల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా రాజకీయాల గురించి ప్రస్తావన తేవడం, అస్తమాను కేసీఆర్ (KCR) సర్కార్‌ను పొగడ్తలతో ముంచెత్తుతుండటంతో ఎక్కడో తేడా కొడుతోందని అందరూ అనుకుంటున్నారట. అంతేకాదు.. ఈ మధ్య తన సొంత జిల్లా నిజామాబాద్‌లో ఎక్కువగా తిరుగుతుండటం.. సామాజిక కార్యక్రమాలు చేపడుతుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

మనసులోని మాట ఇలా..!

‘బలగం’ (Balagam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలో జరిగింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి కేటీఆర్‌ (KTR)ని పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల కృషి ఎంతో ఉందన్నారు. కేటీఆర్ (KTR) పనితీరు గురించి చాలా గొప్పగా కూడా మాట్లాడారు. దిల్ రాజు (Dil Raju) చేసిన ఈ కామెంట్స్.. అటు సొంత జిల్లా నిజామాబాద్ నర్సింగపల్లిలో విస్తుృతంగా తిరుగుతుండటంతో పొలిటికల్ ఎంట్రీ పక్కా అని అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి ఆయన టికెట్ కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా ఎక్కడ్నుంచైనా ఆయన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ మధ్య ఆయన నిర్మాతగా వ్యవహరించే సినిమాల్లో 95 శాతం మంది తెలంగాణ (Telangana) నటీనటులు, సాంకేతిక నిపుణులతోనే చేస్తున్నారు. ఆ ఒక్క 5 శాతం మాత్రమే ఆంధ్రవాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తూ ప్రభుత్వం దృష్టిలో పడుతున్నారు దిల్ రాజు .

మొత్తానికి చూస్తే.. ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం, సొంత జిల్లాలో సేవా కార్యక్రమాలు చేస్తుండటం, తెలంగాణ నటులను ప్రోత్సహిస్తుండటం ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా దిల్ రాజు (Dil Raju) నెక్స్ట్ టార్గెట్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఈయన రాజకీయాల్లోకి రావాలని ఆశగా ఉన్నారు సరే.. వస్తే టికెట్ ఇచ్చి.. గెలిపించుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందో లేదో తెలియాలంటే ఎలక్షన్ వరకూ వేచి చూడాల్సిందే మరి.