జైలు వేదికగా పొత్తు పొడిచింది.. స్కిల్ కుంభకోణం డైవర్ట్ చేయడమే లక్ష్యం?
తెలుగుదేశానికి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఆర్థిక నేరాల కేసుల్లో బెయిల్ అంత త్వరగా రాదని.. ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉండక తప్పదని అర్థమైంది. అసలు ఎప్పటికి బెయిల్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో పార్టీని నడిపేదెవరు? నారా లోకేష్ అయితే పనికి రాడని చంద్రబాబు డిసైడ్ అయినట్టున్నారు. అయన ముడుపులు.. కమిషన్లు మాత్రమే తీసుకోగలడు తప్ప పార్టీని, క్యాడర్‌ను నడిపేంత సీన్ అయితే నారా లోకేష్‌కు లేదు. ఇక నందమూరి బాలకృష్ణ సంగతి సరేసరి.. జనంలోకి వెళ్తే క్యాడర్ భయపడి పారిపోతారు. ఈ తరుణంలో చంద్రబాబు వచ్చేవరకూ పార్టీని జనంలో యాక్టివ్‌గా ఉంచేది ఎలా? అని జైల్లో తీరిగ్గా చంద్రబాబు ఆలోచించినట్టున్నారు. ఈ క్రమంలోనే ఇక లాభం లేదనుకుని తమ పాత చుట్టం.. దత్తపుత్రుడు.. పిలవగానే వచ్చి ఏది చెబితే అది చేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిలిపించారు. గురువారం ములాఖత్ లో భాగంగా చంద్రబాబును లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలిశారు. ఆ తరువాత పవన్ ఒక్కరే మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో తామంతా కలిసి నడుస్తామని, జగన్ అరాచకాలను అడ్డుకుంటామని తెలిపారు.
అయ్యో అనేవాళ్లే కరువయ్యారు..
నిజానికి పవన్ దీనికి ముందు భారీ భారీ డైలాగ్సే చెప్పారు. సముద్రం ఒకరు ముందు తలవంచదు.. తుఫాను ఎన్నడూ యాచించదు వంటి డైలాగ్స్ చెప్పి చంద్రబాబు ముందు మోకరిల్లేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా రాష్ట్రంలో పెద్దగా స్పందనే లేదు. భారీగా సానుభూతి వస్తుందనుకుంటే అదీ లేదు. ఇన్నాళ్లకు అవినీతి పరుడికి తగిన శాస్తి జరిగిందని అనుకున్న వాళ్లే తప్ప.. అయ్యో అనేవాళ్ళు కరువయ్యారు. ఈ విషయం మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం తమ నాయకుల వద్ద ఆవేదన వెలిబుచ్చారు. జనాన్ని పోగుచేయాలని విజయవాడ నాయకులను అయన ఆదేశించిన విషయం కూడా ఆడియో టేప్ లీకైంది. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి తక్షణమే అద్దె జనం అండదండలు కావాలని, లేకుంటే మనుగడ కష్టమేనని టీడీపీకి అర్థమైంది. అందుకే డబ్బు ఎంతైనా పెట్టేందుకు సిద్ధంగా ఉన్న చంద్రబాబు జనంలో డ్రామా నడిపేందుకుస్కెచ్ గీశారు. మొత్తానికి డబ్బుతో ప్రజా ఉద్యమాన్ని నడిపేందుకు సిద్ధమయ్యారు. దీనికి పవన్ తోడు. అయితే పవన్ ఎప్పటి నుంచో టీడీపీతో కలిసే ఉన్నారని ప్రజలకు కూడా తెలుసు.
జనసైనికులు పోలీస్ దెబ్బలు తినాలి..
ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో బలి కానుంది కాపు యువతేనని తెలుస్తోంది. ఇప్పుడు పవన్ ఎలాగూ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి చంద్రబాబు కోసం కాపులు రోడ్డెక్కాల్సిన అనివార్యతను పవన్ కల్పించారు. అంటే ఇప్పుడు జనసైనికులు, కాపు యువత తెలుగుదేశం కోసం ధర్నాలు.. ఆందోళనలు చేయాలి. ప్రభుత్వంతో పోరాడాలి. రెండు భుజాలమీద రెండు పార్టీల జెండాలు పట్టుకుని జన సైనికులు యుద్ధం చేయాలి. కేసులకు ఎదురెళ్లాలి.. ఇంకా అవసరమైతే పోలీస్ దెబ్బలు తినాలి. ఇంతా చేస్తే అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు ? మొదటి నుంచి మన కాపులు.. మన అస్తిత్వం అని ఆశతో ఉంటూ వస్తున్నా కాపు నాయకులూ, యువతకు సీట్లు దక్కుతాయా? అదంతా ఎవరికీ అర్థం కానీ బ్రహ్మ పదార్థం. అసలు పొత్తులో భాగంగా మీకెన్ని సీట్లు అని విలేకరి అడిగిన ప్రశ్నకు అదంతా తరువాత చూద్దాం.. ముందైతే కలిసి పని చేద్దాం అంటూ పవన్ మాట దాటేశారు. అంటే ఇప్పుడు జనసైనికులు సైతం టీడీపీకి కూలీలుగా పని చేయాల్సిందే. ఇక జీతం సంగతి అంటారా ? పవన్ కళ్యాణ్‌కే సీట్ల గురించి క్లారిటీ లేనపుడు జన సైనికులకు మాత్రం ఏమి అంచనా ఉంటుంది. అందాకా ఏమీ అడక్కుండా పని చేయడమే వారి తక్షణ కర్తవ్యంగా పవన్ కల్యాణ్ పరిస్థితులను మార్చేశారు.