కవితతో ప్రారంభమైన ప్రచారానికి ఆమెతోనే బీజేపీ ఫుల్‌స్టాప్ పెట్టనుందా?

కవితతో ప్రారంభమైన ప్రచారానికి ఆమెతోనే బీజేపీ ఫుల్‌స్టాప్ పెట్టనుందా?

రెడ్డొచ్చె మొదలాయె.. అంటారు కానీ ఇక్కడ ఏ రెడ్డి రాకుండానే మొదలవుతోంది.. బ్రేక్ పడుతోంది. ఎందుకు మొదలవుతుందో.. ఎందుకు బ్రేక్ పడుతోందో తెలియడం లేదు. ఇంతకీ విషయమేంటి అంటారా? కవితకు ఈడీ నోటీసులు. ఈ కేసులో చివరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సైతం అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టిన ఈడీ.. కవితను మాత్రం విచారణలకే పరిమితం చేసింది. ఇక గత మూడు నెలలుగా అయితే ఈ విచారణలు కూడా లేదు. అంతా గప్ చుప్. దీంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందంటూ ప్రచారం ప్రారంభమైంది.

కవితను అరెస్ట్ చేయకపోవడం ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తూ బీజేపీని ఒక స్థాయికి తీసుకెళ్లిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి టీ సర్కారుకు వ్యతిరేకంగా మాట కూడా మాట్లాడలేని కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించడం మరొకటి. ఈ రెండు కారణాలు.. బీఆర్ఎస్, బీజేపీకి ఒప్పందం కుదిరిందన్న ప్రచారానికి బలం చేకూర్చాయి. తత్ఫలితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయబోనని బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతుగా నిలవనని బీఆర్ఎస్ ఒప్పందానికి వచ్చాయని గుసగుసలు వినిపించాయి.

ఇక నిన్న సడెన్‌గా కవితకు ఈడీ నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మళ్లీ ఎందుకు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికేనని కొందరు అంటుండగా.. ఈసారి కవిత అరెస్ట్ ఖాయమని.. అందుకే నేడు ఆమె ఈడీ విచారణకు హాజరు కాబోవడం లేదని.. ఇప్పటికే విచారణపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని మరికొందరు అంటున్నారు.

మొత్తానికి కవితకు ఈడీ నోటీసులు కేవలం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కావని చెప్పేందుకు ఆడుతున్న హైడ్రామా అని కవితతో మొదలైన ప్రచారానికి ఈడీ నోటీసులతో బీజేపీ ఫుల్‌స్టాప్ పెట్టేందుకు యత్నిస్తోందని జనం చెప్పుకుంటున్నారు.