బాబు తర్వాత టీడీపీకి దిక్కు.. ఒకే ఒక్కడు ఆయనే..!
నాడు వైసీపీ ఎదుర్కొన్న సవాల్‌నే.. నేడు టీడీపీ ఎదుర్కోబోతోంది. నాడు వైసీపీ అధినేత జగన్ దానిని చక్కగా మేనేజ్ చేయగలిగారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు మేనేజ్ చేయగలరా? అనేది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలేంటా సవాల్? అంటే.. వైసీపీకి పెద్ద దిక్కుగా జగన్ మాత్రమే ఉన్నారు. ఆయన 16 నెలల పాటు జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని ఎలా నడిపిస్తారు? అని జనం బీభత్సంగా ఆలోచించారు. దానిని అధిగమించి షర్మిల, విజయమ్మలను రంగంలోకి దింపి మొత్తానికి సీఎం పీఠాన్ని జగన్ అధిష్టించారు.
ఇప్పుడు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు జైలు పాలయ్యారు. మరి ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి? వాస్తవానికి ఇప్పటి వరకూ నందమూరి బాలకృష్ణ, గతంలో హరికృష్ణ మినహా ఎవ్వరినీ చంద్రబాబు ఎదగనివ్వలేదు. బాలయ్యకైనా ఆయన కూతురిని చంద్రబాబు తన ఇంటి కోడల్ని చేసుకున్నప్పటి నుంచే ప్రయారిటీ ఇవ్వడం.
మరి ఈ విషమ పరిస్థితిలో పార్టీకి దిక్కెవరు? అంటే బాలయ్యే కనిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్య బాగా యాక్టివ్ అయిపోయారు. ప్రెస్ మీట్ పెట్టి వైసీపీని ఏకి పారేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ.. తానున్నానంటూ భరోసా ఇచ్చారు.
నారా లోకేష్ అంటే చాలా చిన్నవాడు. టీడీపీలో తలపండిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి లోకేష్ దిశా నిర్దేశం చేస్తే తీసుకోవడం చాలా కష్టం. తండ్రి బాధ్యతలను తీసుకోవాలని లోకేష్‌కు ఉన్నా కూడా అనుభవరాహిత్యం కారణంగా ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు.
ఈ క్రమంలో బాలకృష్ణ నంబర్ 2 స్థానంలో కనిపిస్తున్నారట. కాస్త ఆగ్రహాన్ని తగ్గించుకుంటే చాలు.. బాలయ్య ఈ పరిస్థితులను చక్కగా హ్యాండిల్ చేయగలరు. ఆయన చెప్పినా కూడా పార్టీలోని సీనియర్లు పెద్దగా ఏమీ ఫీలవరు. బాలయ్యకు ఆది నుంచి ఆ గౌరవం ఉంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు తర్వాత నంబర్ 2 స్థానం బాలయ్యదేనని పలువురు చెబుతున్నారు.