చంద్రబాబుకు షాక్.. మరో కేసు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు టార్గెట్గా ఏపీ ప్రభుత్వం ఆయనపై కేసుల మీద కేసులు పెడుతోంది. తాజాగా సీఐడీ ఆయనపై మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే నాలుగు కేసులు చంద్రబాబుపై నమోదు చేసిన సీఐడీ తాజాగా మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. ఆయనను ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.
2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ మద్యం పాలసీ కారణంగా క్విడ్ ప్రోకో జరిగి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పోయిందనేది ప్రధాన ఆరోపణ. కేవలం లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ పాలసీ ఉందని తెలిపింది. వ్యాట్ మాత్రమే కాకుండా పన్నులను సైతం తీసివేసినట్టు గుర్తించామని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
అంతేకాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కొన్ని కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులివ్వడంతో మద్యం తయారీదారులు, వ్యాపారులు కుమ్మక్కై తమ బ్రాండ్లను సరఫరా చేశారని సీఐడీ పేర్కొంది.ప్రభుత్వ నిర్ణయాలతో 2014-19 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఈ విషయాన్ని కాగ్ సైతం వెల్లడించిదని తెలిపింది. మొత్తమ్మీద రాష్ట్ర ఖజానాకు రూ.1300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ తెలిపింది. ఇదంతా కూడా నంద్యాలకు చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఐడీ తెలిపింది.