తెలంగాణలో టీడీపీ కనుమరుగు.. కాసాని రాజీనామా!

తెలంగాణలో టీడీపీ కనుమరుగు.. కాసాని రాజీనామా!

అవును అనుకున్నట్లే.. తెలంగాణలో టీడీపీ ఇక లేదు. 80వ దశకంలో ఉవ్వెత్తున లేచిన ఒక రాజకీయ కెరటం ఇపుడు విరిగి పడి అడ్రస్ లేకుండా పోయింది. 4 దశాబ్ధాల రాజకీయ జీవితానికి ఇపుడా పార్టీ ఫులుస్టాప్ పెట్టేసింది. ఇక తెలంగాణలో ఆ పార్టీ ఓ జ్ఞాపకంగా మిగిలిపోనుంది అని టీడీపీ శ్రేణులు, అభిమానులు చెప్పుకుంటున్న మాట. తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. పార్టీతో పాటు అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాసాని పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉండి కార్యకర్తలకు న్యాయం చేయలేనని ఆయన వాపోయారు. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని కాసాని తెలిపారు.

రేపు తన కేడర్‌ను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కాసాని వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైలులో కలిశానన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు చెప్పారని.. అలాంటప్పుడు తననెందుకు పార్టీలోకి పిలిచారని అడిగానన్నారు. ఎందుకు పోటీ చేయట్లేదు అనేది చంద్రబాబు చెప్పడం లేదన్నారు. ఆంధ్రలో టీడీపీ – పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నాయని.. తెలంగాణలో బీజేపీ, జనసేన అలయన్స్ ఎలా సాధ్యమని కాసాని ప్రశ్నించారు. చంద్రబాబు కోరితే ఖమ్మం మీటింగ్ పెట్టానన్నారు. తర్వాత నిజామాబాద్‌లో మీటింగ్ పెట్టానన్నారు. ఇంటింటికీ టీడీపీ అని, 41వ ఆవిర్భావ సభ పెట్టించారని కాసాని వెల్లడించారు.

ఆ దొరలు ఫోన్ చేస్తే లేపలేదు..

నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌లపై కాసాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య, లోకేష్ దొరలు తాను ఫోన్ చేస్తే లేపలేదన్నారు. లోకేష్ ఇక్కడ ఎందుకు పెత్తనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లోనే ఉన్నా లోకేష్ తనను పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఎలా చెబుతారని కాసాని ప్రశ్నించారు.

Kasani Resign2
Kasani Resign3
Google News