షర్మిల తప్పుకోవడం వెనుక అసలేం జరిగింది?
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ ప్రజలకు చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కావు. తెలంగాణలో తమ పార్టీ విజయం సాధిస్తుందని దళిత ద్రోహి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామంటూ షర్మిల నానా రచ్చ చేశారు. సడెన్‌గా ఆమె నిన్న ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. అయితే పోటీ చేయాలా? వద్దా? అనేది ఆమె సొంత విషయం కానీ నిన్న మొన్నటి వరకూ ఆమె చెప్పిన మాటలు.. విసిరిన సవాళ్లన్నీ పక్కనబెట్టి పోటీ నుంచి తప్పుకోవడమే విస్మయానికి గురి చేస్తోంది.
కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు షర్మిల ప్రకటించారు. అయితే షర్మిల పోటీ నుంచి విరమించుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. షర్మిల రాజకీయ భవిష్యత్తుపై గట్టి హామీ తీసుకునే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అలాగే తెలంగాణలో తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట.
అయితే.. కేవలం రాజ్యసభ సభ్యత్వంతోనే సరిపెడతారా? లేదంటే ఇంకేమైనా మేలు చేస్తారా? అనే విషయమై కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే.. షర్మిలకు మరో మేలు కూడా చేస్తామని అధిష్టానం నుంచి షర్మిల హామీ తీసుకుంటారని టాక్. అదేంటంటే.. షర్మిల పార్టీలోని ముగ్గురు కీలక వ్యక్తులకు పదవులు కావాలని కోరుతారట. ఆ ముగ్గురిలో వైఎస్ విజయమ్మ కూడా ఉండవచ్చని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ ప్రచారంలో నిజమెంత ఉందనేది మరికొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.