తెలంగాణలో ఈ పత్రాల గోలేంటి?
తెలంగాణలో ఈ పత్రాల గోలేంటో కానీ.. ఒకరు శ్వేతపత్రం విడుదల చేస్తే.. మరొకరు స్వేద పత్రం విడుదల చేస్తామంటున్నారు. తెలంగాణలో అధికారం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్ని శాఖల ప్రక్షాళనకు పూనుకున్నారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని ఆరోపిస్తూ దానిని వెలికి తీసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే అన్ని శాఖల ఆర్థిక వివరాలన్నింటితో ఓ శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో విడుదల చేసింది.
ఇక దీనిపై కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. తాజాగా శ్వేతపత్రానికి కౌంటర్‌గా స్వేద పత్రం విడుదల చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయమని బీఆర్ఎస్ అంటోంది. ఈ క్రమంలోనే తమ తొమ్మిదేళ్ల పాలనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా తమ రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇంతవరకూ బాగానే ఉంది. కౌంటర్లు ఇలా డైలీ సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంటాయా? లేదంటే దీనికి ఎక్కడైనా ఫుల్స్టాప్ పడేది ఉందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేటీఆర్ స్వేదపత్రం తర్వాత కాంగ్రెస్ మళ్లీ కౌంటర్‌గా ఇంకేదో చెబుతుంది. ఆ తరువాత మరేదో పత్రంతో బీఆర్ఎస్ మీడియా ముందుకు వస్తుంది. దీనికి అంతమెందుప్పుడు? ఏది ఏమైనా అసెంబ్లీలో పనికొచ్చే విషయాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు అంటున్నారు. ఆర్థిక విధ్వంసం జరిగి ఉంటే పక్కాగా విచారణ నిర్వహించి దోషులపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు.