ఈ సారి ఆ ఒక్క మచ్చనూ జగన్ చెరిపేస్తారట..
ఏపీలో కుల పిచ్చి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కాస్త ఎక్కువే. పార్టీలకు కుల ముద్రలు ఎప్పుడో పడిపోయాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఇతర రాష్ట్రాలలో వేరు.. తెలుగు రాష్ట్రాలలో వేరు. తెలుగు రాష్ట్రాలకు వస్తూనే కుల ముద్ర వేసేసుకుంది. కాంగ్రెస్ అంటే రెడ్డిల పార్టీగా ముద్ర ఎప్పుడో పడిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైఎస్సార్సీపీ సైతం రెడ్డి కుల ముద్రను వేసుకుంది. టీడీపీ సైతం స్థాపించడంతోనే కమ్మ కుల ముద్రను అంటించుకుంది.
గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ గెలిచిన వారిలో 50 మంది ఎమ్మెల్యేలు రెడ్డి కులానికి చెందిన వారేనంటూ ప్రచారం జరిగింది. ఈసారి జగన్ ఆ కుల మచ్చను చెరిపేసుకోవాలని భావిస్తున్నారట. తమ పార్టీ కేవలం రెడ్ల పార్టీ మాత్రమే కాదు.. అన్ని కులస్తులదనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు అత్యధికంగా ఉన్న బీసీలకు పెద్ద పీట వేయాలని జగన్ భావిస్తున్నారట.
175 అసెంబ్లీ స్థానాలకు గానూ.. అత్యధికంగా అంటే 85 నుంచి 90 దాకా సీట్లు ఈసారి బీసీలకు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. అలాగే ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు ఇస్తారట. ఇక మిగిలిన దాదాపు 50 సీట్లలోనే ఇతర కులస్థులంతా సర్దుకోవాల్సి ఉంటుందట. ఈసారి కాపు సామాజిక వర్గానికి సైతం పెద్ద పీట వేయాలని జగన్ భావిస్తున్నారట. ఇదంతా చూస్తుంటే రెడ్డిలు అతి తక్కువ సీట్లతో ఈసారి సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి జగన్ సరికొత్త సామాజిక విప్లవానికి తెరదీయబోతున్నట్టే తెలుస్తోంది.