మంత్రి రజినీ కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తల దాడి.. 50 మంది అరెస్ట్
అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయ్.. అందరినీ కలుపుకుని సంయమనంతో ముందుకు వెళ్లాల్సిన తరుణంలో టీడీపీ, జనసేనలు బీసీలపై దాడులకు పూనుకుంటున్నాయి. నూతన సంవత్సరం అలా ప్రారంభమయ్యిందో లేదో.. ఆ వెంటనే బీసీలపై ఈ రెండు పార్టీలు దాడులకు తెగబడ్డాయి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అర్ధరాత్రి మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారు.
కార్యాలయంలోకి దూసుకెళ్లి నానా హంగామా చేశారు. కార్యాలయ అద్దాలు పగలగొట్టి, ఫ్లెక్సీలు చించి వేసి రౌడిల మాదిరిగా ప్రవర్తించారు. ఆపై నడిరోడ్డుపై వైసీపీ జెండాలను తగులబెట్టి అలజడి సృష్టించారు. భయబ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే విడదల రజినీ కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకుని టీడీపీ, జనసేన శ్రేణులను చెదరగొట్టారు. అనంతరం దాడికి పాల్పడిన 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆఖరుకి నూతన సంవత్సరం నాడు కూడా టీడీపీ, జనసేన కార్యకర్తల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని, ఒక మహిళా నాయకురాలి ఆస్తులు ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. బీసీలను రాజకీయంగా ఎదగనీయకూడదన్న ఒకే ఒక్క కారణంతో వీరు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు ఉందని… బీసీలపై ఇంత కక్ష పెంచుకున్న ఈ టీడీపీ, జనసేన పార్టీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కలిసి రాజకీయ సమాధి కట్టడం ఖాయమనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది.