జగన్ భారీ స్కెచ్.. 21 నుంచి అమలు..
అన్ని రాష్ట్రాల లెక్క వేరు.. ఏపీ లెక్క వేరు.. ఇక్కడ అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలను ఏకకాలంలో ఎదుర్కోవాల్సి ఉంది. దీనికోసం ఏపీలోని పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో ముందున్నారు. ఇప్పటికే నిత్యం జనాల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను సైతం చకచకా ఖరారు చేస్తున్నారు.
జనవరి 10 నాటికి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక సంక్రాంతి నుంచి అభ్యర్థులందరినీ వారి నియోజకవర్గాల్లో ప్రచారంలోకి దింపాలని భావిస్తున్నారు. మరోవైపు పార్లమెంటు ఎన్నికల కోసం కూడా అభ్యర్థుల ఎంపికపై జగన్ సమాలోచనలు చేస్తున్నారు. వీరి ఎంపిక కూడా జనవరి 15-20 లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈలోపు చేయాల్సిన పనులను కూడా శరవేగంగా పూర్తి చేయాలని జగన్ అనుకుంటున్నారట.
ఫిబ్రవరి నాటికి అన్ని పనులను పూర్తి చేసి బడ్జెట్ సమావేశాల తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఒకవైపు పనులన్నింటినీ చూసుకుంటూనే జనవరి 21 నుంచి 50 రోజుల పాటు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేసేందుకు జగన్ సమాయత్తమవుతున్నారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం తీసిపోకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. ఏ ఒక్క జిల్లా కూడా మిస్ అవకుండా ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని టాక్.