వైసీపీకి ఆ ఎమ్మెల్యే కూడా ఝలక్ ఇస్తారా?
వైసీపీకి రోజుకో నేత ఝలక్ ఇస్తున్నారు. వీరిలో ఆడ, మగ తేడా లేదు. నిజానికి అధికారంలో వచ్చిన మొదట్లో ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సందర్భంతో పని లేకుండా తెగ ప్రశంసలు నిర్వహించేవారు. సినిమా డైలాగ్స్‌ను తీసుకుని మరీ పొగడ్తల వర్షం కురిపించేవారు. అసలు జగన్ వల్లే ఈ స్థాయికి వచ్చామని చెప్పేవారు. జగన్ గీత గీస్తే దానిని దాటే సాహసం చేసేవారు కాదు. జగన్ ఏం చేసినా రయ్‌న మీడియా ముందుకు వచ్చి సమర్థించేవారు.
నాలుగేళ్లు అలా గిర్రున తిరిగిపోయాయి. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. టికెట్ కేటాయింపు వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ పెట్టారు. అయితే పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ టికెట్ల కేటాయింపు జరుగుతోంది. ఆల్ల రామకృష్ణారెడ్డి మొదలు.. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, పార్థసారధి ఇలా చాలా మంది పార్టీకి ఝలక్ ఇస్తున్నారు. ప్రశంసలు కురిపించిన నోటితోనే ధూషణలకు పాల్పడుతున్నారు. దేవుడు అన్న నోటితోనే దెయ్యానివంటూ దూషిస్తున్నారు.
తాజాగా వైసీపీకి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. దీంతో ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్టు సమాచారం. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా పిఠాపురంలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా వైసీపీ జెండా కానీ.. జగన్ ఫోటో కానీ లేకపోవడం ఆసక్తికరంగా మారింది. పుట్టినరోజు వేడుక పేరిట పెద్ద ఎత్తున విందు ఏర్పాట్లను దొరబాబు చేశారు. ఈ విందు కార్యక్రమం పూర్తయ్యాక అనుచరులతో సమావేశమై దొరబాబు వైసీపీకి రాజీనామా చేస్తారని సమాచారం.