కేశినేని నాని రాజీనామా సరే.. నెక్ట్సేంటి?

కేశినేని మరో సంచలన పోస్ట్..

టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే తన కూతురు శ్వేతతో కార్పొరేటర్ పదవికి, పార్టీకి రాజీనామా చేయించారు. ఇక నేడో రేపో ఆయన కూడా రాజీనామా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దాదాపు టీడీపీతో ఆయన బంధమైతే తెగిపోయిందనే చెప్పాలి. ఇక ముందు ఆయన పయనమెటు? అనేది ఆసక్తికరంగా మారింది. తన అనుచరులతో చర్చించిన మీదట ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటానని కేశినేని నాని తెలిపారు.

అయితే కేశినేని నాని బీజేపీలో చేరతారని కొందరు.. వైసీపీలో చేరతారని కొందరు అంటున్నారు. రెండు సార్లు ఎంపీగా విజయం సాధించిన నానికి సొంత బలం అయితే పెద్ద ఎత్తున ఉంది. దీనిలో ఎలాంటి సందేహమూ లేదు. పైగా ఆయన అన్ని పార్టీలతోనూ సఖ్యంగానే ఉంటారు. నేతలందరినీ కలుపుకుని ముందుకు వెళతారు కాబట్టి ఏ పార్టీలో చేరినా ఇబ్బంది అయితే ఉండదు. తన ముక్కుసూటి తత్వమే ఆయనను ఇబ్బందుల పాలు చేస్తోందని కొందరు అంటున్నారు.

వైసీపీ అయితే కేశినేని నాని కోసం ద్వారాలు తెరిచి మరీ ఉంచింది. విజయవాడ స్థానాన్ని ఎవరికీ కేటాయించకుండా నాని కోసం వేచి చూస్తోందని టాక్. ఇక బీజేపీ సైతం తమ పార్టీలో ఆయన చేరితే బాగుంటుందని చూస్తోంది. 2019 ఎన్నికల్లో ఒంటరి పోరుతో దెబ్బ తిన్న బీజేపీకి 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఏ పార్టీతోనూ పొత్తు లేకుంటే డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. ఈ తరుణంలో కేశినేని నాని తమ పార్టీలో చేరితే బాగుంటుందని ఆ పార్టీ ఎదురు చూస్తోంది. మరి నాని మనసులో ఏముందో.. 

Google News