మాజీ ప్రధాని పీవీకి అత్యున్నత పురస్కారం..
కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘భారతరత్న’ పురస్కారాలను ప్రకటించింది. ముగ్గురిని అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ఆ ముగ్గురిలో తెలంగాణకు చెందిన దివంగత నేత ఒకరు ఉన్నారు. ఆయనే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు. అలాగే మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్నను కేంద్రం ప్రకటించింది. దీనిపై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశాన్ని ఆర్థికంగా ఎంతగానో అభివృద్ధి చేశారని.. ప్రపంచ మార్కెట్ యావత్తు భారత్ వైపు చూసేలా చేశారని కొనియాడారు.
తెలుగు రాష్ట్రం నుంచి తొలి ప్రధానిగా..
పీవీ పూర్తి పేరు పాములపర్తి వెంకట నర్సింహారావు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగపూర్ వర్సిటీల్లో ఆయన చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పలు మంత్రి పదవులు, ఆపై ఏపీ ముఖ్యమంత్రిగానూ వ్యవహరించారు. కేంద్రంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం 1991 నుంచి 1996 వరకూ భారత ప్రధానిగా వ్యవహరించారు. తెలుగు రాష్ట్రం నుంచి ప్రధానిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి పీవీ నరసింహారావే కావడం విశేషం. మరో విశేషమేంటంటే.. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా పీవీయే కావడం విశేషం. ఇంకో విశేషమేంటంటే.. 1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 5లక్షల మెజార్టీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. పీవీ 14 భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. హిందీలో కవితలు సైతం రాసేవారు. సాహిత్యంపై పీవీకి చాలా పట్టుంది.
భారతీయ క్రాంతి దళ్ పేరిట పార్టీ..
ఇక చౌదరీ చరణ్ సింగ్ విషయానికి వస్తే ఆయన డిసెంబర్ 23, 1903లో జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఆయన మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్ర్య సంగ్రామంలోనూ ఆపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లోనూ చురుకుగా వ్యవహరించారు. 1967లో భారతీయ క్రాంతి దళ్ పేరిట సొంతంగా ఒక పార్టీని ఆపై.. 1980లో లోక్‌దళ్ పేరిట మరో సొంత పార్టీని స్థాపించారు. యూపీ సీఎంగా రెండు సార్లు పని చేశారు. మొరార్జీ దేశాయ్ హయాంలో హోంశాఖ, డిప్యూటీ ప్రధాని, ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 1979 జులై 28 నుంచి ఆగస్టు 20 మధ్య కేవలం 23 రోజుల పాటు దేశ ఐదో ప్రధానిగా సేవలు అందించారు. ఆ తరువాత ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు.
కరువును చూసి చలించిపోయి..
ఇక స్వామినాథన్ విషయానికి వస్తే ఆయన తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి సాంబశివన్ సర్జన్ కావడంతో ఆయన బాటలోనే స్వామినాథన్ మెడికల్ స్కూల్లో చేరారు. 1943లో బెంగాల్ కరువును చూసి చలించిపోయిన స్వామినాథన్.. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలని వ్యవసాయ పరిశోధనలపై ఫోకస్ పెట్టారు. హరిత విప్లవానికి నాంది పలికారు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో స్వామినాథన్ పాత్ర అపారం.