తెలంగాణను క్లీన్ స్వీప్ చేస్తాం: బండి సంజయ్
సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో తెలంగాణలో బీజేపీ మాంచి జోష్ మీదుంది. ఈసారి బీఆర్ఎస్ను మూడో స్థానానికి నెట్టేసి రెండో స్థానంలో స్థిరపడేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ మాత్రం తెలంగాణను క్లీన్ స్వీప్ చేయాలని యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపిక సైతం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి పొత్తుల జోలికి వెళ్లకుండానే సోలోగానే బీజేపీ తెలంగాణలో పోటీ చేస్తోంది. ఇక బీజేపీ ఎంపీ బండి సంజయ్ సైతం పార్లమెంట్ ఎన్నికల కోసం రంగంలోకి దిగారు. ప్రజాహిత యాత్రలు చేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
ప్రజాహిత యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని ఈ సందర్భంగా బండి సంజయ్ తెలిపారు. తాజాగా ఆయన హుజూరాబాద్‌లోని శాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే అన్ని ఎంపీ స్థానాలను తమ ఖాతాలో వేసుకుంటామని బండి సంజయ్ చెబుతన్నారు. ఇక కేంద్ర రక్షణ శాఖ హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూములివ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సైతం విమర్శలు గుప్పించారు. 6 గ్యారెంటీలను ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో అమలు చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందన్నారు. రూ.500కు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న 90 లక్షల కుటుంబాల్లో 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం దారుణమని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కాగ్ విజిలెన్స్ సంస్థలు తేల్చినా చర్యలు తీసుకోకపోవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.