Raviteja: వాళ్లను రవితేజ ఇంతలా టార్గెట్ చేశాడేం..?

టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Raviteja) సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్కర్లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కష్టపడి పైకి వచ్చిన హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్, గాడ్ ఫాదర్ లేకున్నా తన కామెడీ, తనదైన స్టయిల్, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలా ఎదిగిన రవితేజ.. (Hero Raviteja) ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు ఈయన తప్ప వేరే వాళ్లు చేయలేరు అనే స్థాయిలో ఉన్నాడు. హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈయన మినిమం గ్యారెంటీ హీరో, నిర్మాతల హీరో అని చెప్పుకోవచ్చు. ఈయన్ను స్పూర్తిగా తీసుకుని నాని, విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారంటే మాస్ మహరాజ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇండస్ట్రీలో రావాలన్నా.. వచ్చిన తర్వాత ఓ రేంజ్‌కు ఎదగాలన్నా రవితేజ (Raviteja)ను ఆదర్శంగా తీసుకుంటోంది ఈ జనరేషన్. అయితే ఈ మధ్య ఎందుకో రవితేజ సినిమాల్లో అస్తమానూ.. వారసులు, బ్యాగ్రౌండ్, లక్.. అనే సెటైర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో బ్యాగ్రౌండ్, గాడ్ ఫాదర్ అనే డైలాగ్స్ విన్నప్పుడుల్లా అలా వచ్చిన వారసులకు ఎక్కడో మండిపోతోందట. ఇంకొందరేమో.. మాంచి టైమ్‌లో అది కూడా డైలాగ్‌తో వారసులను కొడుతున్నాడుగా అని తెగ ఎంజాయ్ చేస్తున్నారట.

Advertisement

ఆ మధ్య ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger) మూవీలోనూ.. ‘నేను సపోర్టుతో పైకి వచ్చినవాడిని కాదు’ అనే డైలాగ్ హడావుడి చేశాడు. ‘క్రాక్’ (Krack) సినిమాలో ‘బ్యాగ్రౌండ్’ అనే పదం విలన్ నోట వినిపించగానే చితక్కొట్టేస్తుంటాడు. ఆ తర్వాత వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty)లో లక్కుతో పైకి రాలేదు.. లాంటి డైలాగ్స్ పదే పదే వస్తున్నాయ్. అంతేకాదు త్వరలో రిలీజ్ కానున్న.. ‘ధమాకా’ (Dhamaka) లోనూ అదే తరహాలో డైలాగ్ ఉంది. ‘వెనుకున్న వాళ్లను చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్’.. ‘వెనకెవడు లేకపోయినా ముందుకు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని’ అనే డైలాగ్ ఉంది. ఇలా వరుసగా ఈ డైలాగ్స్ వస్తుండటంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈయన హాట్ టాపిక్ అవుతున్నాడు.

అంటే.. తాను సొంతంగా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి ఎదిగానన్న విషయం పదే పదే ఇలా బల్లగుద్ది చెప్పడమెందుకు.. జనాలకు తెలుసుగా అని వారసులు కొందరు చెవులు కొరుక్కుంటున్నారట. ఇవన్నీ అటుంచితే.. పైన చెప్పిన డైలాగ్స్‌లో చాలావరకు అంతని సొంతంగా రాసినవేనట. వారసులంటే ఈయనకు ఎందుకు అంతలా కోపం వస్తోందో మరి. ఇంతకీ ఈ డైలాగ్స్‌తో వారసులకు ఏం చెప్పదలిచాడో.. మాస్ మహరాజ్ ఇంటెన్షన్ ఏంటో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.