తెలంగాణలో చూచి రాతలు, కుంభకోణాలు.. బొత్స సంచలన కామెంట్స్

తెలంగాణలో చూచి రాతలు, కుంభకోణాలు.. బొత్స సంచలన కామెంట్స్..

అవును.. తెలుగు రాష్ట్రాల మధ్య అసలే పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత పరిస్థితులు ఉండగా.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదని బొత్స వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల బదిలీలు సైతం చేసుకోలేని దారుణ స్థితిలో తెలంగాణ ఉందన్నారు. తెలంగాణలో చూచి రాతలు, కుంభకోణాలు సర్వసాధారణమన్నారు. తమ విధానం, ఆలోచనలు అలా ఉండవని బొత్స అన్నారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణ నుంచి భారీగానే కౌంటర్లు వస్తున్నాయి. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పార్టీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. బొత్స వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఏపీ మంత్రిని ఏకిపారేశారు. తెలంగాణ విద్యావ్యవస్థపై బొత్స చేసిన వ్యాఖ్యలపై ఒకింత ఘాటుగానే స్పందించారు. పోరాడి సాధించుకునన తెలంగాణపై విషం చిమ్మడం ఆపడం లేదని.. దేశంలోనే అత్యున్నత విద్యను కేసీఆర్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. టీఎస్‌పీఎస్సీ నిందితులను పట్టుకుని జైలుకు పంపిన ఘనత తమదేనన్నారు.

Gangula Kamalakar

కౌంటర్లు ఇలా..!

ఏపీలో ఎమ్మెల్యేలు, ఏపీపీఎస్సీ సభ్యులు ఉద్యోగాలకు డబ్బు వసూళ్లు చేస్తున్నారని గంగుల ఆరోపించారు. టీచర్ల బదిలీలకు రూ.లక్షకు పైగా ఇవ్వాల్సిన పరిస్థితి నేటికీ ఉందన్నారు. దీనిపై బొత్స స్పందించిన తర్వాత హైదరాబాద్‌లో అడుగు పెట్టనిస్తామన్నారు. బొత్సను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గంగుల డిమాండ్ చేశారు. మరోవైపు.. బొత్స చూసి రాసి పరీక్షలు పాస్‌ అయ్యారు కాబట్టే .. అలా అంటున్నారని మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో, అక్కసుతో ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తెలంగాణలోనే చదువుకుంటామని ఏపీ విద్యార్థి కోర్టుకు కూడా వెళ్లారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ కాదు.. ఏపీ రాజధాని ఏది అని పరీక్షల్లో అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

మేం రెఢీ..!

అంతటితో ఆగని శ్రీనివాస్.. ఏపీలో ఆలయాల వద్ద కూడా వివక్ష ఉందని సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఏపీలో అంతా కులపిచ్చే తప్ప అభివృద్ధి అస్సలే లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన అన్ని విషయాలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని.. బొత్స ఈ సవాల్‌ను స్వీకరిస్తారా..? అని ఛాలెంజ్ చేశారు. బాధ, ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడారా? లేక రాజకీయంగా ఉపయోగపడుతుందని మాట్లాడారో ఆయనకే తెలియాలన్నారు. ఏపీ అభివృధ్ధిపై దృష్టి సారించాలని, మనుషులు కలిసి మెలిసి ఉండేలా చూడాలన్నారు. అయితే బొత్స కామెంట్స్‌పై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. మొత్తానికి చూస్తే.. తెలంగాణ రాజకీయాలు ‘పవర్’ పాలిటిక్స్‌తో హీట్‌లో ఉండగా.. బొత్స కామెంట్స్‌తో ఒక్కసారిగా ఏపీపై పడ్డారు తెలంగాణ మంత్రులు. మున్ముందు ఇంకా ఎన్నెన్ని చూడాలో ఏంటో మరి.

Google News