Balineni: ప్లీజ్ ప్లీజ్ అని బుజ్జగించిన జగన్.. నాకొద్దు బాబోయ్ అన్న బాలినేని..!

Balineni: ప్లీజ్ ప్లీజ్ అని బుజ్జగించిన జగన్.. నాకొద్దు బాబోయ్ అన్న బాలినేని..!

ప్లీజ్.. ప్లీజ్ అన్నా.. మీరు పదవిలో ఉండాల్సిందేనని సీఎం వైఎస్ జగన్(YS Jagan) పదే పదే బుజ్జగించారు.. కానీ.. మీ పదవి నాకొద్దు బాబోయ్.. నాకు నా నియోజకవర్గమే చాలు మాజీ మంత్రి బాలినేని తేల్చిచెప్పేశారు. అంతేకాదు.. తాను ఎందుకు అసంతృప్తిగా ఉన్నాను.. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలన్నింటినీ ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద తలకాయగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ముందే తన మనసులోని మాటలన్నింటినీ చెప్పేశారు బాలినేని(Balineni). ఇంతకీ జగన్ ఎందుకింతలా బుజ్జగించారు..? బాలినేని ఎందుకొద్దన్నారు..? మధ్యలో వైవీ సుబ్బారెడ్డి ఎందుకొచ్చారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

అసలేం జరిగింది..?

నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్‌‌ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas Reddy) ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాతో వైసీపీలో కలవరం మొదలైంది. బాలినేని మరెవరో కాదు సీఎం వైఎస్ ‌జగన్‌ మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు. ఆయనే రాజీనామా చేయడంతో పార్టీలో అసలేం జరుగుతోందని నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంతకుముందే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం.. కొన్నిరోజులకే బాలినేని ఈ నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ పని అయిపోయిందని ప్రతిపక్షాలు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించాయి. దీంతో అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలు తెలుసుకోవడానికి అధిష్టానం ప్రయత్నించింది. అయితే.. వాస్తవానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేనికి మంచి పలుకుబడి ఉంది. అటు వైవీ సుబ్బారెడ్డి కూడా బడా నేతే కావడంతో ఆయనకున్న పలుకుబడి ఆయనకుంది. కానీ ఇద్దరి మధ్య ఎక్కడో సఖ్యత కుదరట్లేదు. మొదట్నుంచీ ఈ ఇద్దరి మధ్య అస్తమాను విబేధాలు బయటపడేవి. జగన్ సీఎం అయ్యాక బాలినేని(Balineni Srinivas Reddy)ని మంత్రి వర్గంలోకి, సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా తీసుకున్నారు. అయితే రెండోసారి కేబినెట్ విస్తరణలో బాలినేనికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో అప్పుడు మొదలైన అసంతృప్తి.. ప్రొటోకాల్ వివాదం, నిన్న మొన్నటి జిల్లా డీఎస్పీ మార్పు వరకూ కొనసాగుతూ వచ్చింది. ఇక తనకు జిల్లాలో ప్రాధాన్యత తగ్గిందని భావించిన ఆయన పార్టీ పదవి అక్కర్లేదని భావించి రాజీనామా చేసేశారు.

Balineni: ప్లీజ్ ప్లీజ్ అని బుజ్జగించిన జగన్.. నాకొద్దు బాబోయ్ అన్న బాలినేని..!

నాకు వద్దంటే వద్దు..!

రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో కూడా ఉండకుండానే హైదరాబాద్‌కు జంప్ అయ్యారు బాలినేని(Balineni Srinivas Reddy). సీఎంవో నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. దీంతో నేరుగా సీఎం జగనే రంగంలోకి దిగి.. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు రావాలని ఆదేశించారు. దీంతో మంగళవారం నాడు వర్షంలోనే జగన్‌తో భేటీ కావాల్సి వచ్చింది. ఒకవైపు సుబ్బారెడ్డి, మరోవైపు బాలినేనిని కూర్చొబెట్టి పంచాయితీ పెట్టారు జగన్. సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో మళ్లీ రీజనల్ కో-ఆర్డినేటర్ పదవిలోనే కొనసాగాలని జగన్ పదే పదే కోరినప్పటికీ వద్దంటే వద్దని బాలినేని తెగేసి చెప్పేశారు. ఆఖరికి జగన్.. ప్లీజ్.. ప్లీజ్ అని అడగాల్సిన పరిస్థితట. నియోజకవర్గంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని.. అందుకే రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నానని జగన్‌కు బాలినేని వివరించారు. అయితే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యం లేదంటూ బాలినేని అసంతృప్తి ఉన్న మాట జగమెరిగిన సత్యమే. ఇక ఇదే సమావేశంలో వైవీ సుబ్బారెడ్డిని సైతం జగన్ ముందే కడిగిపారేశారట. తనకు తెలియకుండానే జిల్లాలో అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహంతో రగిలిపోయారట.

మొత్తానికి చూస్తే.. ఈ భేటీలో బాలినేని(Balineni Srinivas Reddy) స్థానంలో ఇంకొకరు ఉంటే జగన్ నుంచి రియాక్షన్ ఎలా వచ్చేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదేమో. శ్రీనివాస్ దగ్గరి బంధువు కావడంతో సీఎం కూడా ఆచితూచి అడుగులేస్తున్నారట. మరి ఉమ్మడి ప్రకాశంలో మునుపటి ప్రాధాన్యత ఇస్తేగానీ బాలినేని(Balineni Srinivas Reddy) శాంతించేలా లేరు. ఈ పరిస్థితుల్లో బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy)కి గట్టిగా క్లాస్ పీకి.. ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడిగా తీసుకోవాలని చెబుతారా లేకుంటే.. బాలినేని స్థానంలో మరొకర్ని రీజనల్ కోఆర్డినేటర్‌గా నియమిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.