ఎన్నికల తరుణంలో బీజేపీ కీలక నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షుల మార్పు..

BJP Telugu States Presidents Kishan Reddy, Purandeswari

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ సైతం సంస్థాగతంగా కీలక మార్పులు చేసింది. ఏపీ, తెలంగాణలో అధ్యక్షులను తప్పించింది. వారి స్థానంలో కొత్తగా మరో నేతలకు బాధ్యతలను అప్పగించింది. ఏపీలో సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు.. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సైతం వెల్లడించారు.

తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌.. ఏపీలో మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. కాగా.. కిషన్ రెడ్డి 2010-14 మధ్య ఉమ్మడి ఏపీకి ఒకసారి.. 2014-16 మధ్య తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించడంతో ఆయన కేంద్ర మంత్రి పదవి వరించింది. ఇక పురందేశ్వరి వచ్చేసి ప్రస్తుతం ఒడిశా రాష్ట్రానికి బీజేపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక మీదట ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Google News