కాంగ్రెస్‌కు కలిసొచ్చిన బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఇప్పుడు రెండూ ఒక్కటేనంటూ..

కాంగ్రెస్‌కు కలిసొచ్చిన బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఇప్పుడు రెండూ ఒక్కటేనంటూ..

తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎలుక పోరు.. ఎలుక పోరు.. పిల్లి తీర్చినట్టుగా అయిపోయింది పరిస్థితి. బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకుంటే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ లాభపడింది. తన పనులు తాను సైలెంట్‌గా చేసుకుపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీకి వలసలు కూడా బీభత్సంగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ బాగా కృషి చేస్తోంది. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్ పెద్దగా బీజేపీని టార్గెట్ చేయకపోవడం.. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడం వెనుక బీజేపీ అధిష్టానం హస్తముందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ అంశాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంటోంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనడానికి ఈ కారణాలను చూపిస్తోంది. ఇక ప్రధాని మోదీ వరంగల్ సభకు కేంద్రం సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరైతే కనుక కాంగ్రెస్‌కు మరో అస్త్రం చిక్కినట్టే. ఇక బీజేపీ నాయకత్వ మార్పుతో మూడు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుత చీఫ్ కిషన్ రెడ్డి వర్గం, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వర్గం, బండి సంజయ్ వర్గం. ఈ వర్గ విభేదాలతో బీజేపీ మరింత వెనుకబడిపోయింది. ఇదే సమయంలో విభేదాలన్నీ పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. చేరికలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఆ పార్టీ నేతలు సైతం ఫుల్ యాక్టివ్‌గా జనాల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సత్ఫలితాలను ఇస్తోంది