రగిలిపోతోన్న కమ్యూనిస్టులు.. ఎన్నికల స్ట్రాటజీపై సమాలోచనలు

రగిలిపోతోన్న కమ్యూనిస్టులు.. ఎన్నికల స్ట్రాటజీపై సమాలోచనలు

మునుగోడు ఎన్నికల సమయంలో బాగా వాడేసుకుని విజయం సాధించి.. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చిన బీఆర్ఎస్‌పై కమ్యూనిస్టులు కోపంతో రగిలిపోతున్నారు. తమకంటూ కొన్ని స్థానాలను కేసీఆర్ పక్కనబెడతారని ఆశించి భంగపడ్డారు. నిన్న కేసీఆర్ జాబితా విడుదల చేసినప్పటి నుంచి కమ్యూనిస్టులు ఆలోచనలో పడ్డారు. తమ అభిప్రాయాలను బీఆర్ఎస్ పరిగణలోకి తీసుకోలేదంటూ ఆగ్రహంతో ఉన్న లెఫ్ట్ పార్టీలు నేడు తదుపరి కార్యచరణకు రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు సీపీఎం, సీపీఐలు ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలంతా పాల్గొననున్నారు.

మధిర, ఇబ్రహీంపట్నం, మిర్యాలగూడ, పాలేరు, భద్రాచలం నియోజకవర్గాల్లో సీపీఎం సీట్లు ఆశించింది. మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి, వైరా, దేవరకొండ నియోజకవర్గం సీట్లను సీపీఐ ఆశించింది. మునుగోడు ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌తో చిగురించిన వామపక్షాల పొత్తు అంతలోనే వాడిపోవడంతో ఆ పార్టీలు కంగుతిన్నాయి. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమే అని కమ్యూనిస్టు పార్టీలు విశ్వసిస్తున్నాయి. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక నాటి నుంచి బీఆర్ఎస్‌తో అంటకాగుతున్నాయి. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ప్రకటనతో షాక్‌కు గురయ్యాయి.

మునుగోడు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ సైతం కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని చెప్పి ఇప్పుడు కమ్యూనిస్టులను దారుణంగా దెబ్బకొట్టారు. నిజానికి కమ్యూనిస్టుల మెయిన్ టార్గెట్ బీజేపీ. ఈ క్రమంలోనే దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు గానూ కాంగ్రెస్ పార్టీతో జతకట్టాయి. అయితే తెలంగాణ విషయానికి వస్తే బీజేపీని గట్టిగా ఎదుర్కొనగలిగే సత్తా బీఆర్ఎస్‌కు మాత్రమే ఉందని భావించిన కమ్యూనిస్టులు ఆ పార్టీతో పొత్తుకు మునుగోడు ఎన్నికల సమయంలో సై అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ విజయంలో తమ పాత్ర కీలకమని వామపక్షాలు చెబుతూ వచ్చాయి. నిజానికి ఒకప్పుడు నల్గొండ వామపక్షాలకు కంచుకోట. ఆ ప్రభావం ఇప్పటికీ ఉంది. ఇక నేడు జరగబోయే సమావేశంలో కమ్యూనిస్టులు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.