కుప్పంలో చంద్రబాబు ఓటమి కన్ఫర్మ్: పెద్దిరెడ్డి

కుప్పంలో చంద్రబాబు ఓటమి కన్ఫర్మ్: పెద్దిరెడ్డి

ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. అలాగే వైసీపీ లెక్కలు కూడా ఆ పార్టీకి ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ పార్టీకి పెద్ద ఎత్తున ఓటు చేశారని సమాచారం. దీంతో ఈసారి స్థానాలు అయితే కాస్తో కూస్తో తగ్గొచ్చేమో కానీ పార్టీ విజయం మాత్రం తథ్యమని సర్వేలు సైతం వెల్లడించాయి. ఓటింగ్‌కు ముందే కాదు.. తర్వాత కూడా పార్టీ చాలా కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి తమ పార్టీ విజయం తథ్యమని కూటమి నేతలు అంటున్నారు. ఓటింగ్ శాతం పెరిగినా.. ఏం జరిగినా కూడా విజయం తమదేనని వైసీపీ నేతలు అంటున్నారు.

నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు ముందే తమ కోసం శ్రమించిన ఐ ప్యాక్ బృందంతో భేటీ అయి తమను విజయ పథానికి చేర్చబోతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇక తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము గెలుస్తామని.. మరోసారి తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమని మంత్రి తెలిపారు. తాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకూ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాణిస్తోంది అంతంత మాత్రమేనన్నారు. ఆ పార్టీకి మెజారిటీ వచ్చిన దాఖలాలే లేవన్నారు.

ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి..

పైగా తమ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.. అన్ని హామీలను నెరవేర్చాం కాబట్టి ఈసారి తమ పార్టీ చిత్తూరు జిల్లాలో తప్పక విజయం సాధిస్తుందని పెద్దిరెడ్డి తెలపారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఆయన ఓటమి ఖాయమని.. అక్కడ వైసీపీ జెండా ఎగురుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలన్న నానుడిని బాగా జీర్ణించుకుని ఆది నుంచి కూడా పెద్ది రెడ్డి అయితే కుప్పం పైనే ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓటమి కన్ఫర్మ్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందో లేదో మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.