జగన్‌లో ఉన్న ధీమా.. కూటమిలో లేదేంటి?

జగన్‌లో ఉన్న ధీమా.. కూటమిలో లేదేంటి?

ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది. మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తమ పార్టీ విజయంపై ధీమాతో ఉన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పనిచేసిన ఐ-ప్యాక్‌ టీంతో భేటీ అయి మరీ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఐ ప్యాక్ టీంకు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రికార్డు సృష్టిస్తున్నామని.. మరోసారి అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. 

ఏడాదిన్నరగా తమ పార్టీ కోసం రుషిరాజ్‌ బృందం శ్రమించిందని.. ఈ శ్రమకు ఫలితం దక్కుతుందని చెప్పి జగన్ తన కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టారు. ఈసారి గత ఎన్నికల్లో కంటే ఎక్కువ స్థానాలను గెలవబోతున్నామన్నారు. దేశం మొత్తం ఏపీ ఫలితాలను చూసి షాక్ అవుతుందన్నారు.  ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలనను అందించబోతున్నామని జగన్ తెలిపారు. ప్రజలు సుపరిపాలనను చూసి మద్దతు ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. జగన్ ఒక్కరే కాదు.. పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు సైతం ఇదే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 

జగన్ నెక్ట్స్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా వెదుకుతున్నారు. మరి ఎన్డీఏ కూటమిలో ఈ స్థాయి ధీమా అయితే కనిపించడం లేదు. ఏదో పైకి మాత్రం కూటమిదే విజయమని చెబుతున్నా కూడా లోలోపల ఆందోళన చెందుతోంది. ప్రజల తీర్పును ఇప్పటికే సర్వేలు ప్రకటించడంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ మాత్రం ఎక్కడా లేని ధీమాను ప్రదర్శిస్తోంది. విజయం సాధించాక నిర్వహించాల్సిన మీటింగ్‌ను సైతం ముందే నిర్వహించి ఐ ప్యాక్ టీంకు ధన్యవాదాలు తెలిపింది.