విశాఖ డ్రగ్స్ కేసులో విస్తుగొలిపే విషయాలు!

Vishaka Drugs Case

విశాఖ పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెద్ద దుమారం రేపడం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారంలో పాత్రధారుల వెనుక సూత్రధారులు ఎవరు అనే విషయంలో మీడియాలో, రాజకీయవర్గాల్లో చాలా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు లింక్ ఉందని అధికార పార్టీ ఆరోపిస్తోంది.

అధికార పార్టీ ఆరోపణలను తెలుగుదేశం పార్టీ, ఆ నాయకులు తిప్పికొట్టారు. వాళ్ళు ప్రత్యారోపణలు చేశారు. ఐతే, బ్రెజిల్ నుంచి తెప్పించిన 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌ వ్యక్తి బంధుత్వం, సంబంధాలు ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ లోకి వచ్చాయి.

Advertisement

డ్రై ఈస్ట్ లో డ్రగ్స్‌ కలిపి వాటిని విశాఖ పోర్టుకి తెప్పించింది సంధ్యా ఆక్వా సంస్థ అని అంటున్నారు. ఆ సంస్థ ఎండీ కూనం కోటయ్య చౌదరి. ఈ కోటయ్య చౌదరికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, హీరో నందమూరి బాకృష్ణ చిన్నల్లుడు భరత్‌లతో ఈ వ్యాపార, వ్యక్తిగత బంధాలు ఉన్నాయి అని అంటున్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాతోనూ కోటయ్య చౌదరితో ఉన్న ఆర్థిక బంధం వెలుగులోకి వచ్చింది.

అందుకే, అధికార వైఎస్సార్సీ పార్టీ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోంది. “ఈ డ్రగ్స్ దందాకు ఆర్థిక, రాజకీయ అండదండలు అందించడం, ఇక్కడికి చేరాక మార్కెటింగ్‌ వ్యూహం అంతా టీడీపీ, బీజేపీలోని టీడీపీ కోటరీ నేతలదే,” అనే ఆరోపణ చేస్తున్నారు వైఎస్సార్సీ పార్టీ నేతలు.

సంధ్యా ఆక్వా కంపెనీ ఏర్పాటులో దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు చెంచురామ్ కూడా మొదట పార్ట్నర్ గా ఉండేవారు అని అంటున్నారు. దామచర్ల సత్య, రాయపాటి జీవన్‌, లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ కోటరీకి ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీయాలని వైఎస్సార్సీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ టీడీపీ నేతలతో ఈ కేసులో ఇరుక్కున్న వారు కలిసి పార్టీలు ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు విచారణలో మాత్రమే తేలుతుంది. కానీ ఈ లోపు తెలుగుదేశం నేతలు ఇరుకున పడ్డట్లు కనిపిస్తోంది.