105 మందితో బీఆర్ఎస్ తొలి జాబితా.. 15% సిట్టింగ్‌లు అవుట్..

105 మందితో బీఆర్ఎస్ తొలి జాబితా.. 15% సిట్టింగ్‌లు అవుట్..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ సమయంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఖరారులో నిమగ్నమయ్యాయి. దీనిలో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. నేడు మంచి రోజు కాబట్టి ఇవాళే అభ్యర్థుల ప్రకటన రానుంది. సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థలు జాబితాను రెండు విడతల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 86 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులతో జాబితా సిద్ధమైనట్టు తెలుస్తోంది. తొలి విడతలో దాదాపు 105 పేర్లతో జాబితా వెలువడనుందని సమాచారం. అయితే తొలి జాబితాలో 15 శాతం మినహా మిగిలిన లిస్ట్ అంతా సిట్టింగ్‌లతో కేసీఆర్ నింపేశారని సమాచారం. ఈ క్రమంలోనే టికెట్ దక్కదని తెలుసుకున్న ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కలిసి టికెట్ కోసం అభ్యర్థించేందుకు యత్నిస్తున్నారు. 

రెండో జాబితా విషయానికి వస్తే..

ఇక రెండో జాబితా విషయానికి వస్తే.. ఇది పొత్తులపై ఆధారపడి ఉంటుంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే చర్చలు ఇంకా జరగపోవడంతో పాటు ఇతర పార్టీల చేరికలు సైతం ఉండటం కారణంగా రెండో జాబితాకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కమ్యూనిస్టులతో పొత్తు పొడిస్తే మాత్రం వారికోసం భద్రాచలం, మునుగోడు స్థానాలను వదిలేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వేములవాడ, ఉప్పల్, స్టేషన్‌ ఘన్‌పూర్, జనగామ లాంటి కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు బదులుగా పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. 

వీరికి అవకాశం ఉన్నా కొనసాగుతున్న సందిగ్ధత..

వలసలపై ముఖ్యంగా కేసీఆర్ ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన సిట్టింగ్‌‌లకు టికెట్లు ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తుండటం కూడా అభ్యర్థుల ఖరారు ప్రక్రియపై ప్రభావం చూపుతోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతారన్న వార్తల నేపథ్యంలో సంగారెడ్డి స్థానాన్ని హోల్డ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇక స్థానికుల పరిస్థితుల నేపథ్యంలో ఆర్మూర్, పెద్దపల్లి, హుజూరాబాద్, తాండూరు, నకిరేకల్, ఆసిఫాబాద్‌ స్థానాలను సైతం హోల్డ్‌లోనే పెట్టినట్టు సమాచారం. ఇక్కడ దాదాపు సిట్టింగులకే టికెట్ దక్కే అవకాశం ఉంది.

మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, చామకూర మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కుల పేర్లు ఫిక్స్. దీనిలో సందేహం లేదు కానీ.. వీరిని వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపే అంశాన్ని కూడా కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టు తెలిసింది.  

ఇక తొలి జాబితాలో మధిర, నాగార్జునసాగర్, కోదాడ, ములుగు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, చొప్పదండి, రామగుండం, జహీరాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, జగిత్యాల, నర్సాపూర్, ముషీరాబాద్, అంబర్‌పేట, కల్వకుర్తి, ఇల్లందు నియోజకవర్గాల అభ్యర్థులు ఉండే అవకాశం అయితే ఉంది. 

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌‌కు సంబంధించి కొన్ని పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. సీఎం పరిశీలనలో అయితే దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత, ఆసిఫాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే కోవాలక్ష్మి పేర్లు ఉన్నాయి.

Google News