వైసీపీకి మంచి కిక్ ఇచ్చిన పంచాయతీ ఎన్నికలు
ఏపీలో పలు పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎసీపీ తన హవా కొనసాగించింది. ఎన్నికలు ఏవైనా సరే వైసీపీదే హవా అని మరోసారి నిరూపితమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీస్‌ను తలపించిన ఈ ఎన్నికలు వైసీపీకి మంచి బూస్ట్ ఇచ్చాయి. సంక్షేమ పథకాలు పార్టీని నిలబెట్టాయి. ఫలితంగా మరోసారి ఘన విజయాన్ని వైసీపీ మరోసారి ఘన విజయాన్ని అందుకుంది. గ్రామస్థాయిలో తనకు ఉన్న పట్టును నిలుపుకొంది. పార్టీ క్యాడర్ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. ఇక ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తగిలాయి.
ఎక్కడ చూసినా ఎదురు దెబ్బలే..
ఈ ఎన్నికల్లో మంచి సక్సెస్ సాధించి తద్వారా వైసీపీ హవా జనాల్లో తగ్గిపోయిందని నిరూపించేందుకు టీడీపీ యత్నించింది. కానీ ఫలితం దక్కలేదు. వైసీపీ దూకుడు ముందు చతికలబడింది. ఇక జనసేన పరిస్థితీ దీనికి భిన్నంగా ఏమీ లేదు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పంచాయతీ ఉపఎన్నికలోనూ జనసేన మద్దతుదారుడు ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించారు. టీడీపీ, జనసేనలను తీవ్రంగా నిరాశ పరిచేలా ఎన్నికల ఫలితాలు ఉండటం గమనార్హం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. పెదలంకం, అన్నాపురం, భద్రి పంచాయతీలను వైసీపీ గెలుచుకుంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మ పంచాయతీ వైసీపీ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అలాగే విజయనగరం జిల్లాలోని పీఎస్ఆర్ పురం, కొప్పర్ల, ఓణి అగ్రహారం, పడాల పేటలో వైసీపీ విజయం సాధించింది.
ఎక్కడ ఎన్ని..?
ఉప ఎన్నికలు జరగాల్సిన మొత్తం 66 పంచాయతీల్లో ముందే 31 సీట్లను వైసీపీ ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఇక 1064 గ్రామ వార్డులకు గాను 819 స్థానాలను కూడా ఏకగీవ్రం చేసుకుంది. దీంతో.. శనివారం 35 పంచాయతీలు, 245 గ్రామ వార్డులకు ఉప ఎన్నికలు జరగ్గా ఎక్కడ చూసినా వైసీపీ మద్దతుదారులే గెలిచారు. 149 వైసీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. ఈ గెలుపును సెమీ ఫైనల్‌గా భావిస్తున్నామని టీడీపీ చెబుతుండగా.. వైసీపీ మాత్రం ఇదీ మా సత్తా అని చాటి చెబుతోంది. ఈ గెలుపుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదీ కదా వైసీపీకి కిక్కు..!
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో 6 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అందులో ఐదుగురు వైసీపీ మద్దతుదారులు గెలిచి.. జెండా పాతారు. కుప్పం అడ్డా.. చంద్రబాబు అడ్డా అనే చోట వైసీపీ జెండా ఎగరడం నిజంగా అధికార పార్టీకి పెద్ద కిక్కిచ్చే విషయమే. అంతేకాదు.. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీ మద్దతుదారుడు గెలవడం ఇది ఇంకాస్త కిక్కు పెంచిందని చెప్పుకోవచ్చు. మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. ఇక జేసీ బ్రదర్స్ అడ్డా అయిన తాడిపత్రి నియోజకవర్గంలోనూ ఇదే రిపీట్ అయ్యింది. జేసీ బ్రదర్స్ సొంత మండలం అయిన పెద్దపప్పురులో వైసీపీ మద్దతు దారులు గెలుపొందారు. చూశారుగా.. ఎక్కడ చూసినా ఫ్యాన్ సునామీనే.. ఈ ఫ్యాన్ స్పీడ్‌కు సైకిల్ అడ్రస్ లేకుండా పోయింది.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకుమించి టీడీపీ చూస్తుందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.