రేవంత్ రెడ్డికి పోలీసుల ఝలక్.. ఆ వ్యాఖ్యల ఫలితమేనట..
ఎంపీ రేవంత్ రెడ్డి భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన భద్రత సిబ్బంది నాటకీయ పరిణామాల మధ్య గురువారం ఉదయం విధుల నుంచి వెనక్కి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఎంపీ హోదాలో ఇచ్చిన 2+2 గన్‌మెన్లను 1+1 కు తగ్గించారని ఆరోపిస్తున్నారు. అయితే గురువారం ఒకే ఒక్క గన్‌మెన్ మాత్రమే విధులకు హాజరయ్యారు. అదేమని ఆరా తీయగా.. 1+1 సెక్యూరిటీ కల్పించాలని ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలున్నట్లు చెప్పారు. దీనిపై ఆగ్రహించిన తనకు యథాతథంగా భద్రత కావాలని.. లేదంటే అసలు భద్రతే అక్కర్లేదని చెప్పడంతో ఆ ఒక్కరు సైతం వెనక్కి వెళ్లిపోయారు.
ప్రస్తుతం తనకు గన్‌మెన్ల రక్షణ లేదని రేవంత్ సాయంత్రం మీడియాకు వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారుల వద్ద మీడియా ప్రస్తావించగా.. రేవంత్‌రెడ్డికి భద్రతను తాము ఉపసంహరించలేదని తెలిపారు. మరోవైపు రేవంత్ రెడ్డికి భద్రతకు సంబంధించి కొత్త వాదన తెరపైకి వచ్చింది. ఇటీవల ఆయన మహబూబ్‌నగర్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలే భద్రత తగ్గింపునకు కారణమనే ప్రచారం జరుగుతోంది. ‘మహబూబ్‌నగర్ పోలీసుల పేర్లు రెడ్‌డైరీలో రాసిపెడతాం. 100 రోజుల తర్వాత అసలు మిత్తితోని చెల్లిస్తం..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారంటూ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఆక్షేపించింది. ఈ వ్యాఖ్యల భద్రత ఉపసంహరణకు కారణమని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం తాము భద్రత తొలగించలేదని చెప్పడం విశేషం.