కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీతక్కే సీఎం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీతక్కే సీఎం : రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తానా సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ తెలిపారు. అయితే ఎన్నారైలు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అవసరమైతే సీతక్కను తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎన్నారైలు రేవంత్‌ను.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గిరిజనులు, దళితుల్లో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రేవంత్.. తప్పకుండా చేస్తామని అవసరమైతే సీతక్కను సీఎంను చేస్తామన్నారు.

Congress MLA Seethakka

కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తుందన్నారు. దీనికి పలు ఉదాహరణలు కూడా వివరించారు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందన్నారు. ఇక్కడ పని చేసే వారికి పైరవీలతో పని లేకుండా కచ్చితంగా గౌరవం దక్కుతుందన్నారు. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, వివిధ మంత్రులను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు కావొచ్చన్నారు. తమ పార్టీ ఎప్పటికీ దళితులు, గిరిజనులకు అనుకూలంగా ఉంటుందన్నారు. మొత్తానికి సీతక్క పేరును సీఎం అని చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కామెంట్ ఒక్కసారిగా వైరల్ అవుతోంది. దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Advertisement