బీఆర్ఎస్‌కు కోమటిరెడ్డి షాక్.. కేసీఆర్ ఖేల్ ఖతమేనా?

బీఆర్ఎస్‌కు కోమటిరెడ్డి షాక్.. కేసీఆర్ ఖేల్ ఖతమేనా?

అపర చాణిక్యుడంటూ ఇన్నాళ్లూ కేసీఆర్‌ను ఆ పార్టీ వాళ్లు కీర్తించరు. నిజానికి కేసీఆర్ చాణిక్యుడే. అందులో సందేహమే లేదు. కానీ ఎదుటి వారిని తక్కువ అంచనా వేస్తే మాత్రం ఎంతటి చాణిక్యుడైనా దెబ్బ తినాల్సి వస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీని తక్కువంచనా వేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దెబ్బతిన్నారు. ఇక కాంగ్రెస్ దేముంది? మూడు కలహాలు.. ఆరు కుంపట్లని అంతా భావించారు. కానీ ప్రభుత్వ పగ్గాలు రేవంత్ రెడ్డి అందుకుని సరైన మార్గంలో నడిపిస్తున్నారు.

ఇక నిన్నటికి నిన్న సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నల్లగొండలో సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ సభ నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. అసలు కోమటిరెడ్డి ధైర్యమేంటి? ఎందుకలా వ్యాఖ్యానించారనేది చర్చనీయాంశంగా మారింది.

కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఏవో బెదిరించడానికో.. భయపెట్టేందుకో చేసిన వ్యాఖ్యలని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తాజాగా ఢిల్లీలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బి. వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలాగే పలు చోట్ల బీఆర్ఎస్ టు కాంగ్రెస్ వలసలు కొనసాగుతున్నాయి. ఇక ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ మరింత అప్రమత్తంగా ఉండాలి. పార్లమెంటు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నిలదొక్కుకోలేకుంటే.. పెద్ద మొత్తంలో సీట్లు సాధించకుంటే ఆ పార్టీ పని మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇక బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూడాలి.