బీజేపీ అందుకే ఏపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోందా ?

Telangana BJP: తెలంగాణలో బీజేపీ పతనమైనట్టే.. లెక్కలతో సహా తేల్చి చెప్పిన ఆ పార్టీ నేత

ఏపీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. దీనికోసం ప్రధాన పార్టీలన్నీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. వైసీపీ ఎలా తిరిగి అధికారంలోకి రావాలా? అని యోచిస్తుంటే.. టీడీపీ, జనసేనలు వైసీపీని గద్దె దింపి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు శ్రమిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి బాగా యాక్టివ్ అయిపోయి గెలవాలని కాదు కానీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సొంత సోదరినే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది.

ఇన్ని పార్టీలు ఇంతలా శ్రమిస్తుంటే బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. అసలు అధికార పార్టీతో బీజేపీ రహస్య స్నేహం నెరుపుతోందనే అనుమానాలు జనాల్లో అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. ఏం జరిగినా కూడా వైసీపీ మాత్రం బీజేపీని మాట అనేందుకు సాహసించదు. చివరకు ఏపీకి ఏమాత్రం సహకరించకున్నా.. ఏపీలో ఉన్న సంస్థలను ప్రైవేటుపరం చేస్తామన్నా… ఇస్తామన్న హోదా ఇవ్వకున్నా.. పోలవరాన్ని అటకెక్కించినా బీజేపీని వైసీపీ తూలనాడదు.

ఇక బీజేపీకి మిత్రపక్షంగా జనసేన వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతలు.. జనసేనను, ఆ పార్టీ అధినేతను ఎన్ని మాటలన్నా కూడా బీజేపీ మౌనం వహిస్తూనే ఉంటుంది. పొరపాటున ఖండించడం కూడా ఉండదు. అందుకే ఈ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం ఉందని జనం భావిస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో బీజేపీ ఎవరి పక్షం వహిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఒంటరిగా బరిలోకి దిగడమంటే పరోక్షంగా వైసీపీకి సహకరించడమేనన్న టాక్ కూడా ఉంది. ఇప్పటికైనా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటుందో లేదంటే సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతుందో చూడాలి.