రైతు నోటి కాడి బుక్కను కాంగ్రెస్ పార్టీ లాక్కొంది: ఎమ్మెల్సీ కవిత

రైతు నోటి కాడి బుక్కను కాంగ్రెస్ పార్టీ లాక్కొంది: ఎమ్మెల్సీ కవిత

రైతుబంధు అంశం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. రైతుబంధును ఈసీ నిరాకరించిందనగానే.. వెంటనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ పండగ చేసుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇది తీరని నష్టాన్ని తీసుకొస్తుందని సంబరాలు చేసుకుంటోంది. అయితే రైతుబంధు అనేది ఎన్నికల కోసం తెచ్చింది కాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రైతుబంధును కావాలనే కాంగ్రెస్ ఆపించిందన్నారు. 

అసలు కాంగ్రెస్‌కు అంత అభద్రత ఎందుకని కవిత ప్రశ్నించారు. రైతులంతా బీఆర్ఎస్‌వైపే ఉన్నారన్న అక్కసుతోనో.. భయంతోనో రైతుబంధుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు. రైతు నోటి కాడి బుక్కను కాంగ్రెస్ పార్టీ లాక్కొందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ అంటూ ప్రియాంకా గాంధీ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని.. అసలు దానిని ప్రైవేటుకు అప్పగించిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. మతం పేరుతో ఒక పార్టీ మంట పెడుతుంటే.. కులం పేరుతో మరో పార్టీ చిచ్చు పెట్టాలని చూస్తోందని కవిత విమర్శించారు. 

Advertisement

ఇక తనపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించడంపై మంత్రి హరీష్ రావు సైతం స్పందించారు. తాను కేవలం రైతుబంధుకు ఈసీ అనుమతి ఇచ్చిందని మాత్రమే చెప్పానని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. రైతుల నోటి దగ్గరి ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటోందన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్‌ది పేగు బంధమని.. తామేమీ ఓట్ల కోసం రైతుబంధు తేలేదని తేల్చి చెప్పారు. యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.