దేశంలోనే అత్యంత కాస్ట్లీ ఎన్నికలుగా రికార్డ్ క్రియేట్ చేయనున్న తెలంగాణ?
తెలంగాణలో ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నేటితో ప్రచారపర్వం ముగియనుంది. సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలు కానుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ పార్టీల అగ్ర నేతలంతా సాయంత్రానికి తిరుగు పయనం కానున్నారు. మైకులు మూగబోనున్నాయి. ఇక ప్రలోభాల పర్వానికి పార్టీల నేతలు తెరదీయనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. పెద్ద ఎత్తున పోలీస్ పహారాను దాటుకుని మరీ మద్యం, డబ్బు పంపిణీకి ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.
ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. ఓటు ఎంత పలుకుతోంది? ఎక్కువగా ఏ నియోజకవర్గంలో ఎక్కువ పలుకుతోంది? కరీంనగర్, వేములవాడ, మునుగోడు, ములుగు, ఖమ్మం, పాలేరు, కామారెడ్డి, గజ్వేల్‌తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే తెలంగాణ ఎన్నికలు అత్యంత కాస్ట్లీ ఎన్నికలు కానున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో మునుగోడు ఉపఎన్నికలకు ఈ క్రెడిట్ దక్కింది. ఓటు దాదాపు రూ.10 వేలు దాకా అక్కడ పలికిందట.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే… రాష్ట్రం మొత్తమ్మీద అన్ని పార్టీలు కలిసి రూ.20 వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయవచ్చని టాక్ నడుస్తోంది. ఇన్ని వేల కోట్లా? అని ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. ముఖ్యంగా జనరల్ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో ఓటు అత్యధికంగా ఎంత రేటు పలుకుతోంది.. అంటారా? ఏకంగా రూ.5 వేలు పలుకుతోందట. కొన్ని చోట్ల మూడు వేలు.. ఇంకా కొన్ని చోట్ల అంతకంటే తక్కువ పలుకుతోందని సమాచారం. ఏదిఏమైనా ఈ కొన్ని గంటల్లో రాష్ట్రంలో డబ్బులు కొన్ని వేల కోట్లు ఖర్చవడం ఖాయం.