Ponguleti: కొత్త పార్టీ పెట్టనున్న పొంగులేటి.. సీఎం కేసీఆరే మెయిన్ టార్గెట్..!
తెలంగాణ సీఎం కేసీఆర్(KCR)ను టార్గెట్ చేస్తూ మరో కొత్త పార్టీ రాబోతోంది. పార్టీలో తనకు పెద్దగా ప్రాధాన్యమివ్వకపోవడంతో మనస్తాపం చెంది బయటకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy) కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
ఆయనను తమ పార్టీలోకి రప్పించాలని రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఎంతగానో ప్రయత్నించాయి. కానీ పొంగులేటి వ్యూహం మరోలా ఉంది. కొత్త పార్టీకే ఆయన ఓటు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి మరీ దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నెల 15 తర్వాత ఏ క్షణమైనా పొంగులేటి నుంచి కీలక ప్రకటన రానుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాగా.. కేసీఆరే మెయిన్ టార్గెట్‌గా పొంగులేటి ఈ పార్టీని పెట్టబోతున్నారని సమాచారం. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి అది సాధ్యమయ్యే పనేనా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
జాతీయ పార్టీల వల్లే కేసీఆర్‌ను ఢీకొట్టడం సాధ్యం కావడం లేదు. అలాంటిది ఖమ్మం జిల్లాపై తప్ప మరో జిల్లాపై పట్టులేని పొంగులేటి.. కేసీఆర్‌ను ఢీకొట్టాలనుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రైతు సమాఖ్య (టీఆర్‌ఎస్) పేరుతో ఎన్నికల కమిషన్ వద్ద ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది. ఇది పొంగులేటి రిజిస్టర్ చేయించారని టాక్ నడుస్తోంది.
45 నియోజకవర్గాల్లో తన అనుచరులను బరిలోకి దించాలని పొంగులేటి భావిస్తున్నారని కూడా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో పార్టీ సహా అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.