Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల పోరు.. తెలంగాణలో బెట్టింగ్‌ల జోరు..
కర్ణాటకలో ఎన్నికలు తెలంగాణ(Telangana)లో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఎన్నికలపై కర్ణాటక మాటేమో కానీ తెలంగాణలో అయితే బెట్టింగుల జోరు బీభత్సంగా నడుస్తోంది. నిజానికి సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్టులే ఈ బెట్టింగ్‌లకు ఆధారంగా మారాయి. ఇక్కడ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇరు పార్టీలు గెలుపు ధీమాతోనే ఉన్నాయి.
సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్టులు కూడా ఆసక్తికరం. కొన్ని బీజేపీకి.. మరికొన్ని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. ఇక అంతే.. అంతే తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తోంది? ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది? ముఖ్య నేతలు పోటీ చేసిన ప్రాంతాల్లో గెలుపెవరది? అనే అంశాలే లక్ష్యంగా బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.
తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిలో రాయలసీమకు చెందిన వారే ఎక్కువట. ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ అడ్డాగా ఈ బెట్టింగులు జరుగుతున్నాయి. ఇక ఈ బెట్టింగ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీజేపీపై వంద పెట్టి గెలిచిన వారికి రూ.105, కాంగ్రెస్పై రూ.100 పెడితే రూ.103 ఇస్తున్నారట. క్రికెట్ బెట్టింగ్‌ల్లో మాదిరిగా కంప్యూటర్లను వినియోగించకుండా.. డైరీలను వినియోగిస్తున్నారని సమాచారం. ఏ పార్టీపై బెట్టింగ్ పెడుతున్నారు? బెట్టింగ్ పెట్టే వారి పేర్లు.. ఎంత మొత్తం పెట్టారనేది డైరీలో కోడ్ భాషలో రాసి పెట్టుకుంటున్నారట. ఇక డబ్బు రూపంలోనే లావాదేవీలన్నీ జరుగుతున్నాయట. మొత్తానికి కర్ణాటక ఎన్నికలు తెలంగాణలో బీభత్సంగా కాసుల వర్షం కురిపిస్తున్నాయి.